కేంద్రంలో వచ్చే సంకీర్ణంలో కేసీఆర్‌దే కీ రోల్‌.. కవిత - MicTv.in - Telugu News
mictv telugu

కేంద్రంలో వచ్చే సంకీర్ణంలో కేసీఆర్‌దే కీ రోల్‌.. కవిత

March 15, 2019

వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వచ్చే అవకాశముందని టీఆర్ఎస్ ఎంపీ కవిత అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి, కాంగ్రెస్‌కు పూర్తి స్థాయి మెజార్టీ వచ్చే అవకాశం లేదని సర్వేలు చెబుతున్నాయని,  ప్రాంతీయ పార్టీలే కీలకం కానున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.

శుక్రవారం నిజామాబాద్ పర్యటనకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘సంకీర్ణ ప్రభుత్వంలో కేసీఆర్‌దే కీ రోల్‌ అవుతుంది. సర్వేల్లో కాంగ్రెస్, బీజేపీ గ్రాస్ పూర్తిగా పడిపోయింది. 17 మంది టీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్లమెంట్‌లో ఉంటేనే.. తెలంగాణ హక్కుల్ని సాధించుకోవచ్చు. ప్రజలందరూ కూడా నేషనల్ పార్టీలు కాదు.. గ్లోబల్ పార్టీలు ఉండాలని కోరుకుంటున్నారు. పార్టీలకు అంతర్జాతీయ స్థాయిలో ఆలోచించే దృక్పథం ఉండాలి..’ అని ఆమె అన్నారు.

‘టీఆర్‌ఎస్ పార్టీకి ప్రధానమైన అంశం.. తెలంగాణ ప్రజల సమస్యలు, అభివృద్ధి జాతీయ పార్టీలు తెలంగాణ సమస్యలను ఏనాడూ పట్టించుకోలేదు. ప్రాంతీయ పార్టీలే వల్లే రాష్ట్రాల్లో అభివృద్ధి సాధ్యమవుతుంది. భారీ స్థాయిలో ఎంపీ అభ్యర్థులందర్నీ గెలిపించి, ఢిల్లీలో మన స్వరాన్ని వినిపించాలి. అప్పుడే మన సమస్యలను ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉంటుంది. కేంద్రంతో పోరాడి నిధులు తెచ్చుకునే సత్తా టీఆర్‌ఎస్ పార్టీకి, ఎంపీలకు ఉంది. 16 మంది టీఆర్‌ఎస్ అభ్యర్థులను, ఒక ఎంఐఎం అభ్యర్థిని గెలిపిస్తే 17 మంది సైనికులం పార్లమెంట్‌లో ఉంటాం. లోక్‌సభలో ముందుండి కొట్లాడి మన హక్కులను సాధించుకుంటాం. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని తొమ్మిది రాష్ట్రాలు కాపీ కొట్టాయి’ అని అన్నారు కవిత.

ఈ నెల 19వ తేదీన నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం గిరిరాజ్ కాలేజీ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్నామని, ఆ సమావేశానికి సీఎం కేసీఆర్ హాజరు కాబోతున్నారని తెలిపారు.