సాగునీటి శాఖకు కేసీఆర్ కీలక ఆదేశాలు..  - MicTv.in - Telugu News
mictv telugu

సాగునీటి శాఖకు కేసీఆర్ కీలక ఆదేశాలు.. 

December 7, 2019

Irrigation department.

ముఖ్యమంత్రి కేసీఆర్ సాగునీటీ శాఖకు కీలక ఆదేశాలు జారీచేశారు. రాష్ట్ర సాగునీటి శాఖ పరిధిలో కొత్తగా చేపట్టనున్న పనులకు టెండర్లు పిలిచేందుకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రూ.33,397 కోట్ల పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను ఆరంభించాలని కేసీఆర్‌ సాగునీటి శాఖకు ఆదేశాలు జారీ చేశారు. కాళేశ్వరం పరిధిలోని అదనపు టీఎంసీ పనులకు సంబంధించిన విలువ రూ.25 వేల కోట్లకు పైగా ఉండగా, ఖమ్మం జిల్లాలోని సీతారామ, కొత్తగా చేపట్టనున్న పనుల విలువ మరో రూ.7,400 కోట్ల మేర ఉండనుంది. ఈ పనులకు ఈ నెలాఖరులోగా టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టాలని కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలోని 3 పంప్‌హౌస్‌లకు కలిపి రూ.7,998 కోట్ల అంచనాతో చేపట్టగా, అదనపు టీఎంసీ పనులను మరో రూ.4,394 కోట్లతో చేపట్టారు. ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు వరకు రూ.11,500 కోట్ల పనులకు వచ్చేవారం టెండర్లు పిలవనున్నారు. అలాగే మిడ్‌మానేరు నుంచి అనంతగిరి రిజర్వాయర్‌ వరకు పైప్‌లైన్‌ వ్యవస్థ నిర్మాణానికి రూ.4,142 కోట్లు, అనంతగిరి నుంచి మల్లన్నసాగర్‌ వరకు రూ.10,260 కోట్లు అవుతుందని అంచనా వేశారు. మొత్తంగా ఈ నిర్మాణానికి రూ.14 వేల కోట్లకుపైగా వ్యయం అవుతుండగా, ఈ పనుల టెండర్లకు కేసీఆర్ ఆదేశించారు. 

ప్రాజెక్టు పరిధిలోని క్యాంపు కార్యాలయాల కోసం రూ.43 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ఇక సీతారామ ఎత్తిపోతల పథకాన్ని రూ.13,884 కోట్లతో చేపట్టగా, ఇందులో ఇప్పటికే 8 ప్యాకేజీల పనులకు రూ.4,816 కోట్లతో టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టారు. ఇప్పుడు సత్తుపల్లి ప్రధాన కాల్వ ప్యాకేజీ-9 నుంచి జూలూర్‌పాడ్‌ మండలం వరకు (ప్యాకేజీ-13 వరకు) చేపట్టే పనులకు టెండర్లు ఈ నెలలోనే ఆరంభించాలని సీఎం సూచించారు. ఈ పనులకు రూ.2,952 కోట్లవుతుందని అంచనా వేశారు.

ఇక దుమ్ముగూడెం బ్యారేజీ నిర్మాణానికి రూ.3 వేల కోట్లు, పవర్‌హౌస్‌కు మరో రూ.1,500 కోట్లు అవుతుంది. ఈ బ్యారేజీ ద్వారా ఖమ్మం జిల్లాలో సీతారామ కింద నిర్ణయించిన 6.40 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వడంతో పాటు, నాగార్జునసాగర్‌ కింద ఖమ్మం జిల్లాలో ఉన్న 2.60 లక్షల ఎకరాలకు నీరు అందించాలని సీఎం నిర్ణయించారు. ఈ పనులకు కూడా నెలాఖరులోగా టెండర్లు పిలిచి పనులు ఆరంభించాలని కేసీఆర్ సూచించారు.