’కేసీఆర్ కిట్’ కు రెండు అవార్డులు..! - MicTv.in - Telugu News
mictv telugu

’కేసీఆర్ కిట్’ కు రెండు అవార్డులు..!

September 9, 2017

ప్రభుత్వ ద‌వాఖానాల్లో ప్రస‌వించే ప్రతి మ‌హిళ‌కు నాలుగు విడ‌త‌లుగా రూ.12 వేలు, అమ్మాయి పుడితే 13 వేలు తెలంగాణ ప్రభుత్వం ఇస్తోంది.  అంతేగాక తల్లీబిడ్డలకు ఉపయోగపడే రూ.2 వేల విలువైన వస్తువులతో ’కేసీఆర్ కిట్’ ను కూడా అందిస్తున్నారు. ఇప్పుడు  కేసీఆర్ కిట్ పథకానికి 2017 సంవత్సరానికి గాను ‘స్కోచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్’, ‘స్కోచ్ సిల్వర్’ అవార్డులు దక్కాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజ‌ల కోసం ప్రారంభించే కొత్త‌, వినూత్న ప‌థ‌కాల అమ‌లు తీరుని ప‌రిశీలించి, వాటికి  స్కోచ్ సంస్థ జ్యూరీ స‌భ్యులు మార్కులు వేస్తారు. వాటి ఆధారంగా ఈ అవార్డుకి ఎంపిక చేస్తారు. అలా ప్రతి ఏటా ఇచ్చే అవార్డు ఈసారి వైద్య ఆరోగ్యశాఖ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘ కేసీఆర్ కిట్’ ప‌థ‌కానికి దక్కింది. హెల్త్ కేట‌గిరీలో దేశంలోనే రెండో అద్భుత ప‌థ‌కంగా ‘కేసీఆర్ కిట్’ ఉండడం వల్ల రెండు అవార్డులను సొంతం చేసుకుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సంద‌ర్భంగా ఈ ఏడాది జూన్ 3వ తేదీన ప్రారంభించిన కెసీఆర్ కిట్ల ప‌థ‌కం దేశంలోని అనేక రాష్ట్రాల‌ను ఆక‌ర్షిస్తున్నది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల ప్రతినిధులు,ఆరోగ్య మంత్రులు కెసిఆర్ కిట్ల ప‌థ‌కాన్ని ప‌రిశీలిస్తున్నారు.