తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం బెంగళూరులో జేడీయూ నేతలైన మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో సమావేశమయ్యారు. దేవెగౌడ ఇంట్లో మొదట విందులో పాల్గొన్న కేసీఆర్ తర్వాత వారిద్దరితో చర్చలు జరిపారు.
దేశ రాజకీయాల్లో మూడో ప్రత్యామ్నాయం, కేంద్ర ప్రభుత్వ విధానాలపై నిరసన, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం వంటి అనేక అంశాలపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. భేటీ తర్వాత విలేకర్ల సమావేశం నిర్వహించకపోవడంతో వివరాలు పూర్తిగా తెలియడంలేదు. కేసీఆర్ వెంట రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, జీవన్ రెడ్డి తదితరులు ఉన్నారు. బెంగళూరు పర్యటన ముగించుకున్న కేసీఆర్ నాలుగు గంటలకు హైదరాబాద్ కు బయల్దేరారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయ నిర్మాణం కోసం కేసీఆర్ ఇటీవల ఢిల్లీ, పంజాబ్ వెళ్లి అక్కడి ముఖ్యమంత్రులతో చర్చలు జరపడం తెలిసిందే.