అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా ప్రసంగించారు. రెండు గంటలకు పైగానే మాట్లాడి బీజేపీ, కాంగ్రెస్‌లను దుమ్మెతిపోశారు. ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. ఇటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై కూడా నిప్పులు చెరిగారు. అయితే బీఆర్ఎస్ నుంచి బీజేపీలో వెళ్లిన ఈటల రాజేందర్‌ను కేసీఆర్ ప్రశంసించారు. పదేపదే ఈటల పేరును ప్రస్తావిస్తూ ప్రసంగించారు. ఇదే విషయం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపికైంది. పార్టీ వీడాక ఈటల పేరు ఎత్తడానికి సంకోచించిన కేసీఆర్..అసెంబ్లీ వేదికగా 15 సార్లు వరకు ఈటల పేరు ప్రసావనకు తేవడం సంచలనం సృష్టిస్తోంది. దీనిపై మతలబు ఏంటో తెలియక ఇటు బీజేపీ నేతలు, అటు బీఆర్ఎస్ నేతలు సందిగ్థంలో పడిపోయారు.
కేసీఆర్ ఏమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈటల లేవనెత్తిన ప్రశ్నలకు కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. ‘మిత్రులు రాజేందర్ మాట్లడుతూ అనేక అంశాలను లేవనెత్తారు’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. మెస్ ఛార్జీలు పెంచాలన్న ఈటల డిమాండ్‌పై కేసీఆర్ సభలోనే చర్యలు చేపట్టారు. వెంటనే డైట్ ఛార్జీలు పెంచాలని మంత్రులు హరీశ్ రావు, సబితకు సూచించారు. రెండు మూడ్రోజుల్లోనే మెస్ ఛార్జీలు పెంచాలని ఆదేశించారు. అవసరమైతే ఈటలకు ఫోన్ చేసి సలహాలు తీసుకోవాలన్నారు.హాస్టల్‌లో చదివే పిల్లలకు సన్న బియ్యం అందించాలనే ఆలోచన తన మాజీ సహచరుడు ఈటలదేనని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
ఈటల కౌంటర్
అసెంబ్లీలో సీఎం కేసీఆర్ తన పేరు పదే పదే ప్రస్తావించినంత మాత్రాన పొంగిపోనని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. తన మీద చేసిన దాడిని మరిచిపోనని అని అన్నారు. తనకు తానుగా పార్టీ మారలేదని.. వాళ్లే తనను గెంటేశారని ఈటల పేర్కొన్నారు. గెంటేసిన వాళ్లు మళ్లీ పిలిచినంత మాత్రాన పోనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈటల పార్టీ మారుతున్నారని.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా ఇలాగే ప్రచారం చేశారని గుర్తు చేశారు. టీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు సైనికుడిగా పని చేశా.. ఇప్పుడు బీజేపీలో కూడా సైనికుడిగానే పని చేస్తానన్నారు. మెస్ ఛార్జీల మీటింగ్‌కు పిలిస్తే తప్పకుండా వెళ్తానని ఈటల రాజేందర్ చెప్పారు.