కేసీఆర్ థర్డ్ ఫ్రంట్‌కు ఊపిరి.. రిజర్వేషన్ ఉద్యమం - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్ థర్డ్ ఫ్రంట్‌కు ఊపిరి.. రిజర్వేషన్ ఉద్యమం

March 12, 2018

ఒక లక్ష్యం కోసం పోరాడేవారిని ఏకతాటిపైకి తీసుకొస్తే అనుకున్నది సాధించడం సులువు. రాజకీయాలు, సినిమాలు, వ్యాపారం.. దేనికైనా ఈ సూత్రం వర్తిస్తుంది. తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత ఏర్పాటు చేస్తున్న థర్డ్ ఫ్రంట్ నిర్మాణం వెనుక ఉన్న వ్యూహం ఇదే. దేశంలో కాంగ్రెస్, బీజేపీల వల్ల జరిగిన అభివృద్ధి ఏమీ లేదని, ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అవసరం అని ఆయన చెప్పారు. నిజానికి మూడో కూటమి ప్రయోగాలు దేశానికి కొత్తకాదు. తక్షణ అవసరాల కోసం అవి ఏర్పాటై, అవసరాలు తీరిపోయాక కాలగర్భంలో కలసిపోయాయి. వ్యూహ రచనలో, అమలులో సిద్ధహస్తుడైన కేసీఆర్‌కు వీటి గురించి తెలుసు.కలకాలం నిలిచే సిద్ధాంతం..కాంగ్రెస్ లౌకికవాద రాజకీయాలతో, బీజేపీ హిందూత్వమత  రాజకీయాలతో మనుగడ సాగిస్తున్నాయి. ఇలా అనడం కొంత కటువుగా అనిపించినా చరిత్ర చెబుతున్న సత్యం అదే. లౌకిక ఛత్రం కింద కమ్యూనిస్టులు, ఇతర చిన్నాచితకా పార్టీలు కాంగ్రెస్ నీడలోకి వెళ్లాయి. హిందూత్వం పేరుతో శివసేన, ఇతర ప్రాంతీయ శక్తులు బీజేపీని కౌగిలించుకున్నాయి. కాంగ్రెస్‌కు, ఇతర లౌకిక శక్తులకు తేడా కొట్టినప్పుడు మూడో ఫ్రంట్ పుట్టి మూణ్నాళ్లు ముచ్చట అన్నట్లు సాగింది వ్యవహారం. ఈ రెండు శిబిరాలు కాకుండా కేసీఆర్ నవీన శిబిరాన్ని ప్రతిపాదిస్తున్నారు. ఆయన తాజా ప్రకటనలు, రిజర్వేషన్ల కేటాయింపు, వాటి పెంపు హక్కు తమకే ఉండాలని పార్లమెంటు ఉభయ సభల్లో కొన్నాళ్లుగా టీఆర్ఎస్ ఎంపీలు చేస్తున్న ఆందోళన, దేశవ్యాప్తంగా మారుతున్న కులరాజకీయాల సమీకరణాలు చూస్తుంటే కేసీఆర్ పక్క వ్యూహంతో తన థర్డ్ ఫ్రంట్ ఆలోచనను బయటపెట్టారనిపిస్తుంది.మెజారిటీ వర్గాలను ఆకట్టుకుంటే..

ప్రజలు కేవలం మతం, లౌకికవాద రాజకీయాలవైపు కాకుండా సొంత అస్తిత్వం, ప్రయోజనాల కోసం, రాష్ట్రాలు జాతీయ సమగ్రత వంటి అంశాలపై కాకుండా స్వప్రయోజనాలు, స్థానిక సెంటిమెంట్లు(విస్తృత అధికారాలు, నీటి కేటాయింపులు, జల్లికట్టు నిషేధం ఎత్తివేత, సహకార, సమాఖ్య వ్యవస్థ వంటి) కోసం పోరాడుతున్న కాలం ఇది. అధికారంలో, ప్రభుత్వ కొలువుల్లో వాటా కోసం భారీ ఉద్యమాలు సాగుతున్నాయి. జాట్, పటేళ్లు, గుజ్జర్లు, తదితర కులాల కోటా ఉద్యమాలు దేశం దృష్టిని ఆకర్షించాయి. జాట్ల ఉద్యమానికి జడిసి రాజస్థాన్ వంటి కొన్ని రాష్ట్రాలు రిజర్వేషన్ కూడా ప్రసాదించాయి. భవిష్యత్ అంతా కోటా ఉద్యమాలదే అన్నట్లుంది పరిస్థితి. సమాజంలో అత్యధిక శాతం బడుగు, బలహీన వర్గాలే ఉన్నారు కనుక కోటా పోరాటాలు ఎన్నికల ఫలితాలను సుదీర్ఘ కాలం తారుమారు చేస్తాయి. బీసీ, దళితన, మైనారిటీ వర్గాలు దాదాపు ప్రతి రాష్ట్రంలోనూ భారీ ఓటు బ్యాంకులు. వీటిని ఆకట్టుకుంటే ఓట్ల వర్షం కురుస్తుంది. బీజేపీ, కాంగ్రెస్ ఈ నిజాన్ని తెలుసుకుని, విజయాలు సాధించాయి, తప్పడగులు వేసి డక్కామొక్కీలు కూడా తిన్నాయి. తెలంగాణాలో 85 శాతం ఉన్న బీసీ, దళితులు, ముస్లిలకు వారికి సరిపడినట్లు రిజర్వేషన్లు కేటాయించాలన్న కేసీఆర్ వాదన వెనుక ఇంత చరిత్ర ఉంది.

మరోపక్క..దేశంలో బలంగా ఉన్న ఇతర ప్రాంతీయ నేతలు, పార్టీలు మమతా బెనర్జీ, చంద్రబాబు నాయుడు, నవీన్ పట్నాయక్, అన్నాడీఎంకే.. స్థానిక అంశాలపైనే తప్ప రిజర్వేషన్ వంటి జాతీయ అంశాలపై పోరాడ్డం లేదు. చంద్రబాబు కాపు కులస్తుల ఒత్తిడికి తట్టుకోలేక వారికి కోటా తీసుకొచ్చాయి. అయితే ఆయన కూడా బీసీ, దళిత, మైనారిటీలవైపు దృష్టిసారించడం లేదు. ఇది కేసీఆర్‌కు కలసి వచ్చే అంశం. తెలంగాణ రాష్ట్ర సాధన కూడా ఆయనకు మరో సానుకూల అంశం. అనుకున్న సాధించగల నాయకుడిగా ఆయనకు ఉన్న పేరు జాతీయ రాజకీయాల్లో ప్లస్‌గా రడం ఖాయం. తెలంగాణ అభివృద్ధి.. ముఖ్యంగా నదీజలాల, సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులు, జానకర్షక సంక్షేమ పథకాలు, హైదరాబాద్ మెరుపులు మరో కలసివచ్చే అంశం.

జాతీయ రాజకీయాల్లో..జనాభాలో అత్యధిక శాతం ఉన్న ప్రజలను రిజర్వేషన్ ఎజెండా కింద ఏకం చేస్తే చక్కని ఫలితాలు వస్తాయి. కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ఇప్పటికిప్పుడు భారీగా సీట్లు కొల్లగొట్టకపోయినా అంచెలంచెలుగా దేశం నలుమూలకూ విస్తరించే అవకాశం ఉంటుంది. కోటా పోరులో ఆరితేరిన బీఎస్పీ వంటి పార్టీలతోపాటు సమాఖ్య వ్యవస్థ నినాదంతో జేఎంఎం, తృణమూల్ వంటి పార్టీలనూ కలపి ఉంచొచ్చు. ఈ అంశాలు జాతీయ రాజకీయాల్లో ఎన్నటికీ వన్నె తగ్గనివి. సొంతంగా మెజారిటీ లేకపోయినా ఓ స్థాయిలో సీట్లు సంపాదించుకుని.. బీజేపీ, కాంగ్రెస్‌లతో ఏదో ఒకదానికి మద్దతు ఇచ్చో, లేకపోతే వాటి నుంచి తీసుకునో హస్తినను తన గుప్పెట్లో ఉంచుకునే వీలు ఉంటుంది. ఇవన్నీ పైకి ‘అయ్యేవా, పొయ్యేవా’ అన్నట్లు అనిపించినా, ఏ ఉద్యమమైనా తొలి అడుగుతోనే మొదలవుతుంది అని భావిస్తే కేసీఆర్ ఆ దిశగా సరైన దిశలోనే పయనిస్తున్నారని స్పష్టం అవుతుంది.