వచ్చే అసెబ్లీ ఎన్నికల్లో గెలుపు తమదేనని, పార్టీ శ్రేణులు ఆత్మవిశ్వాసంతో సమరోత్సాహంతో తలపడాలని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు దూసుకెళ్లి, విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు.
అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు వస్తున్నాయని కొందరు ప్రచారం చేస్తున్నారని, అలాంటిదేమీ ఉండదని, షెడ్యూలు ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని సీఎం స్పష్టం చేశారు. ‘‘ప్రతి నియోజవర్గంలోనూ సభలు పెట్టండి. ప్రభుత్వం అన్ని వర్గాల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను భారీగా ప్రచారం చేయండి. ప్రజలు మనవైపే ఉన్నారని సర్వేలు చెబుతున్నాయి. గెలుపు మనదే పాదయాత్రలు, సభలు, సమావేశాలు నిర్వహించండి’’ అని చెప్పారు. వరంగల్ నగరంలో ఏప్రిల్ 27న జరగాల్సిన ప్లీనరీ స్థానంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎంపీలు, జెడ్పీ అధ్యక్షులు పాల్గొన్నారు.