రోజులు గడుస్తున్న కొద్దీ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. కొత్తకొత్త ఎత్తుగడలతో, పదునైన మాటలతో ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఏపీలో కొత్త సమీకరణాలకు తెర తీసింది. ఏపీలో రాజకీయం, సామాజిక వర్గాలను వేరుగా చూడలేమని భావించిన కేసీఆర్.. బీఆర్ఎస్ దూకుడును పెంచి ఇప్పటికే పార్టీ అధ్యక్షుడిని ప్రకటించేశారు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి పెద్దపీట వేయడంతో కొన్ని నియోజకవర్గాల్లో గెలుపోటములతో సంబంధం లేకుండా ఓట్లను చీల్చే అవకాశముందని భావిస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ప్రభావం ఎంతమేర ఉంటుందో ఇప్పటికే సర్వే చేయించినట్టు సమాచారం. 20 అసెంబ్లీ స్థానాలు, మూడు లోక్ సభ స్థానాల్లో ఓట్లు పడవచ్చనే అభిప్రాయం బీఆర్ఎస్ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.
వీటిలో మరీ ముఖ్యంగా తెలంగాణను ఆనుకుని ఉన్న జిల్లాలను టార్గెట్ చేశారని తెలుస్తోంది. ఇక్కడైతే విభజన సెగ ప్రభావం తక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. జగ్గయ్యపేట, నందిగామ, మాచర్ల, నూజివీడు వంటి సరిహద్దు ప్రాంతాలతో పాటు గుంటూరు 2, విశాఖ, వంటి స్థానాలను పరిశీలిస్తున్నారు. మాజీ మంత్రి రావెల కిశోర్ బాబును బాపట్ల పార్లమెంట్ స్థానంలో పోటీ చేయించాలని అధిష్టానం ఆలోచన. అంతేకాక, ఉండవల్లి అరుణ్ కుమార్, కొణతాల రామకృష్ణలను పార్టీలో చేర్చుకుంటే ఎంతోకొంత ప్రభావం ఉంటుందని, ఎన్నికలు సమీపించే కొద్దీ చేరికలను ముమ్మరం చేసి మరిన్ని ప్రాంతాల్లో పోటీ చేసి జాతీయ పార్టీగా ముద్ర వేసుకోవాలని ఆరాటపడుతున్నారు. మరి బీఆర్ఎస్ ఎంట్రీ ఏపీలో ఎవరికి మేలు చేస్తుందో, ఎవరికి కీడు చేస్తుందో తెలియాలంటే ఎన్నికలు వచ్చే వరకు ఆగాల్సిందే.