అధికారులు మారేనా..నెల ముందే పెన్ష‌న్ ప్యాక్ ఇచ్చేనా..? - MicTv.in - Telugu News
mictv telugu

అధికారులు మారేనా..నెల ముందే పెన్ష‌న్ ప్యాక్ ఇచ్చేనా..?

May 19, 2017

 

సర్కారీ కొలువులో ఉన్నంతసేపు దర్జా. నెల నెల ఠంచనుగా జీతం,నిర్ణీత పనివేళలు..ఆదివారం హాలీడే.. బిందాస్ లైఫ్. రిటైర్మెంట్ దగ్గర పడిందంటే ప్రభుత్వ ఉద్యోగిలో టెన్షన్ మొదలవుతుంది. ఇక ముందు భవిష్యత్ ఏంటన్న ఆలోచన గందరగోళపరుస్తోంది. ఇలా ఆలోచిస్తుండగానే రిటైర్డ్ అయ్యే రోజు రానే వస్తోంది. కన్నీళ్లతో కొలువుకు బైబై చెబుతూ ఇంటికెళ్లిపోతారు. ఇక ఇక్కడ నుంచి నుంచి వాళ్లకు అసలు కథ స్టార్ట్ అవుతోంది. సర్కారీ పనుల కావాలంటే ఎంత కష్టమో తెలుస్తుంది. పెన్షన్ ప్యాక్ కోసం ఆఫీసుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరగాలి. కనిపించిన అధికారికల్లా నమస్తేలు పెడుతూ ఆఫీసుల ముందు కూర్చోవాల్సిందే..తెలంగాణ రాక ముందు…తెలంగాణ వచ్చాక కూడా ఇదే పరిస్థితి ఉంది.
ఇదేదో మామూలు వ్యక్తులు చెప్పిన మాటలు కాదు..సాక్షత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన నిప్పులాంటి నిజాలు. శుక్రవారం హైద‌రాబాద్‌లోని హెచ్ఐసీసీలో రాష్ట్ర క్షేత్ర‌స్థాయి పోలీసు అధికారుల‌తో స‌మావేశంలో ఆయన మాట్లాడుతూ “రాష్ట్రం ఏర్ప‌డిన త‌రువాత కూడా కొన్ని దిక్కుమాలిన అల‌వాట్లు ఇంకా ఉన్నాయి. ఒక ఉద్యోగి రిటైర్ అయిన తరువాత అత‌నికి రావ‌ల్సి న్యాయ‌బ‌ద్ధ‌మైన బెనిఫిట్స్ కోసం కోసం అఫీసుల చుట్టూ తిర‌గాల్సిన దుస్థితి ఉంది.
చీఫ్ ఇంజ‌నీర్ స్థాయి వ్య‌క్తి రిటైర్ అయిన త‌రువాత త‌న పెన్ష‌న్ కోసం ఆఫీసు ముందు అటెండ‌ర్ కూర్చునే చోట కూర్చుని ప‌డిగాపులు కాయ‌డం కలిచి వేసింది. ఇట్లాంటి క‌ల్చ‌ర్ మ‌న రాష్ట్రంలో ఏకోశానా ఉండొద్ద‌ని” కేసీఆర్ పోలీసు అధికారుల‌ను ఆదేశించారు. పోలీసు శాఖ‌లో కిందిస్థాయి నుంచి పైస్థాయి వ‌ర‌కు ఎవ‌రు రిట‌ర్డ్ అయినా స‌రే వారిని అత్యంత గౌర‌వంతో ప్ర‌భుత్వ వాహ‌నంలో వారు ఎక్క‌డికి వెళ్తానంటే అక్క‌డ చేర్చాల‌ని అధికారుల‌ను అదేశించారు. ఉద్యోగి రిటైర్మెంట్ ఇంకా ఒక నెల రోజులు ఉండ‌గానే అత‌నికి రావలిసిన బెనిఫిట్స్‌కు సంబంధించి ఓ ప్యాక్‌ని రెడీ చేసి ఉంచాల‌ని సూచించారు. రిటైర్ అయిన రోజు పూల‌మాల‌, శాలువాతో స‌న్మానించి ఆ ప్యాక్‌ని అత‌ని చేతిలో పెట్టాల‌న్నారు.
నిజంగా సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు త్వరలో రిటైర్ కాబోయే ఉద్యోగుల కళ్లలో ఆనందాన్ని నింపేవి. కానీ గతంలోనే ఒకటి రెండుసార్లు ఆయన ఇలా చెప్పారు. కానీ కొన్నిశాఖల్లో అధికారులు పట్టించుకోలేదు. రిటైర్డ్ ఉద్యోగి పెన్షన్ ప్యాక్ కోసం పడాల్సిన కష్టాలు పడుతూనే ఉన్నారు. ఇక ఇప్పడైనా సీఎం ఆదేశాలతో అధికారులు మారుతారేమో చూడాలి.