గంట వీడియో ఫుటేజ్ చూస్తే దిమ్మ తిరుగుద్ది - కేసీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

గంట వీడియో ఫుటేజ్ చూస్తే దిమ్మ తిరుగుద్ది – కేసీఆర్

November 3, 2022

మునుగోడు ఎన్నిక పోలింగ్ పూర్తయిన అనంతరం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గురువారం రాత్రి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ సంస్థలు వంటి అంశాలపై మాట్లాడారు. అలాగే రాష్ట్ర ఎన్నికల అధికారిపై బీజేపీ చేసిన విమర్శలను తిప్పికొట్టారు. ఇక సంచలనం రేపిన మొయినా బాద్ ఫాంహౌస్ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గంట పాటు ఉన్న వీడియో చూస్తే దిమ్మతిరిగిపోతుందని బహిరంగంగా ఎంత దుర్మార్గానికి ఒడిగట్టారో అర్ధం అవుతుందన్నారు. ఆ వీడియోలను తాను దేశంలోని సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీలకు, అన్ని మీడియా సంస్థలకు పంపిస్తున్నట్టు వెల్లడించారు.

అలాగే అన్ని రాజ్యాంగ బద్ధ సంస్థలకు, దేశంలోని అన్ని పార్టీల అధ్యక్షులకు ఈ వీడియోను పంపుతున్నానని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతున్నట్టు తెలిపారు. నియంతలా పరిపాలిస్తానంటే ఇందిరా గాంధీకి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. రాజకీయాలు, ఎన్నికల్లో గెలుపోటములు వంటివి సహజమని, అంతిమంగా ఎవరైనా ప్రజా తీర్పును గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టి విభజన రాజకీయాలు చేస్తున్న బీజేపీని ప్రజలు బుద్ధి చెప్తారన్నారు. ఓ ప్రధాని అయి ఉండి బెంగాల్‌లో దీదీ మీ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారని చెప్పడం ఏంటి? ఇదెక్కడి దౌర్భాగ్యం. ఈ విషయంలో యువత ముందుకు రావాలి. నాకేంటి అని కూర్చుంటే దేశం ఉనికి అంతర్జాతీయ స్థాయిలో లేకుండా పోతుంది. దేశం దెబ్బతింటే వంద ఏళ్లు వెనక్కి పోతామని ప్రజలు గుర్తుంచుకోవాలి. ఏమరుపాటు పనికిరాదు. ఎమ్మెల్యేల కొనుగోలు చేసే వారి వెనుక ఏం బలం ఉంది. వీరి ఎక్కడ నుంచి వచ్చింది ఇంత ధైర్యం అని ప్రశ్నిచారు.