కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ వ్యూహమేంటి? పీఎం కావడానికేనా.. లేకపోతే.. - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ వ్యూహమేంటి? పీఎం కావడానికేనా.. లేకపోతే..

March 5, 2018

జాతీయ స్థాయిలో థర్డ్ ఫ్రంట్ కోసం తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యత్నిస్తుండడం తెలిసిందే. కాంగ్రెస్, బీజేపీలు దేశాన్ని చైనా, అమెరికా, జర్మనీల్లా ముందుకు తీసుకెళ్లలేకపోయాయని, వాటికి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అవసరం అని ఆయన అన్నారు. అయితే దేశవ్యాప్తంగా బీజేపీ గాలి బలంగా వీస్తున్న నేపథ్యంలో దేశంలో థర్డ్ ఫ్రంట్ విజయం సాధిస్తుందా? గతంలో ఎన్నోసార్లు విఫలమైన ఈ మూడో కూటమి వ్యూహం, ప్రయోగాలు..  వచ్చే ఎన్నికల్లో ఫలిస్తాయా? థర్డ్ ఫ్రంట్ .. రాజకీయాల నాడి బాగా తెలిసిన కేసీఆర్ ఏదో ఆవేశంతో చేసిన ప్రకటనా? లేకపోతే పక్కా వ్యూహంతో అన్నీ మదింపు చేసుకునే ఆయన రంగంలోకి దిగారా?మోదీ బాటలో..

అభివృద్ధి నమూనా అంటూ గుజరాత్‌ను చూపి మోదీ జాతీయ రాజకీయాల్లో ప్రభంజనం సృష్టించడం తెలిసిందే. గత ఎన్నికల్లో బీజేపీని చూసి కాకుండా మోదీని చూసే ఎక్కువ మంది ఆకర్షితులయ్యారన్నది కాదనలేని నిజం. కాంగ్రెస్ అవినీతి పాలనతో వారు విసుగెత్తి ఉన్నా, మోదీ హామీలు, గుజరాత్ ‘అభివృద్ధి’ నమూనా వగైరా ప్రచారాలు జనాన్ని ఆకర్షించాయి. ఒక రాష్ట్రముఖ్యమంత్రిని హద్దులు దాటించి ఏకంగా ప్రధానమంత్రిని చేశాయి. కేసీఆర్ ఇదే మార్గాన్ని అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది.

భారీ ప్రచారం..

తెలంగాణలో ఆయన చేసిన అభివృద్ధి ఎంత అన్నది పక్కనబెడితే.. ప్రభుత్వం విస్తృతంగా చేస్తున్న ప్రచారం ఇరుగుపొరుగు రాష్ర్టాలను ఆకర్షిస్తోంది. మొన్నటి ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు, మెట్రో రైల్, కాళేశ్వరం, మిషన్ భగీరథ, కాకతీయ, రైతు సమన్వయ సమితుల నుంచి మొదలుకుని కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ల వరకు కేసీఆర్ చేపట్టిన పథకాలు, ప్రాజెక్టులకు ఆయన ప్రభుత్వం కోట్లు ఖర్చుచేసి ప్రచారం చేసింది. మోదీ సీఎంగా ఉన్నప్పుడు జాతీయ పత్రికల్లో గుజరాత్ అభివృద్ధిపై ముందుపేజీల్లో ప్రకటనలు వచ్చినట్లే కేసీఆర్ సర్కారు ప్రగతిపైనా వచ్చాయి. ఏ రాష్ట్రప్రజలైనా అభివృద్ధి కోరుకుంటారు కనుక తన పనితీరుకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తుందని, ఓట్లు కురుస్తాయని ఆయన భావిస్తున్నారు. తాను మోదీతో తూగకపోయినా, ఒకసారి ప్రయత్నించి చూస్తే పోయేదేముంది అని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. పైగా… బీజేపీని ఇప్పుడు అడ్డుకోకపోతే భవిష్యత్తులో దాన్ని నిలువరించడం కష్టం. త్రిపుర చిన్న రాష్ట్రమే అయినా అక్కడ గత ఎన్నికల్లో ఒక్క సీటునూ గెలవనేని కాషాయదళం ఈసారి ఏకంగా 40కిపైగా సీట్లు గెలవడం ప్రాంతీయ పార్టీలను భయాందోళనకు గురిచేస్తోంది. తెలంగాణాలో బీజేపీ అంత బలంగా లేకపోయినా ఆదిలోనే అంతమొందించాలనే వ్యూహానికి గులాబీ నేత పదును పెడుతున్నారు. ప్రజాభిమానం ఉన్నా.. నిధులు, అనుమతులు, ఎన్నికలు, ఈవీఎంలు గట్రా కేంద్రం చేతుల్లో ఉండడం కేసీఆర్ వంటి లోకల్ లీడర్లను ఆందోళనకు గురిచేస్తోంది.దక్షిణాది సెంటిమెంట్..

దక్షిణ భారతాన్ని కేంద్రంలోని ఉత్తరాది పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారన్న ఆరోపణ చాలా పాతదే. తెలుగువాడి ఆత్మగౌరవం పేరుతో ఎన్టీఆర్ సృష్టించిన ప్రభంజనం తెలిసిందే. నటుడు కమల్ హాసన్ కూడా తాజాగా ఈ ‘ఉత్తరాది దోపిడీ, నిర్లక్ష్యం, అవమానం’ భావనను తెరపైకి తెచ్చారు. కేసీఆర్ తన వ్యాఖ్యలతో దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లారు. ఉత్తరాది పాలకులపై మండిపడుతున్న పవన్ కల్యాణ్, చంద్రబాబు, కేంద్ర పెత్తనంపై కళ్లురుముతున్న మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్ వంటి లోకల్ నేతలను ఒక వేదికపైకి తెస్తే బీజేపీకి బలమైన ప్రత్యామ్నాయాన్ని, ప్రాంతీయంగా బలంగా ఉన్న కూటమిని అందించినట్లవుతుంది. అయితే కేవలం దక్షిణాది గురించే మాట్లాడితే మమత, శిభు సొరేన్ వంటి వారు దూరం అవుతారు. అందుకే కేసీఆర్ ‘దేశానికి కొత్త దశా, దిశా నిర్దేశిస్తాను..’ అని అంటున్నారు. ఇటు దక్షిణాది నేతలను, అటు ఉత్తరాది నేతలను ఒకదరికి చేర్చే ‘అభివృద్ధి’ మంత్రాన్ని పఠిస్తున్నారు.

జాతీయ రాజకీయాల్లోనే..

స్థానిక రాజకీయాల నుంచి కేంద్రానికి వెళ్లి చక్రం తిప్పిన నేతలు చాలామందే ఉన్నారు. సత్తా లేకపోయిన కలసి వచ్చే పార్టీల అండతో దేవెగౌడ, ఐకే గుజ్రాల్, చంద్రశేఖర్ తదితరులతో చాలా ప్రయోగాలు చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో ఎత్తుపల్లాలు ఎప్పుడూ ఉండేవే. అయతే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పితే ఆ హోదాతో ఎన్నేళ్లయినా చలామణి కావొచ్చు. తెలంగాణలో టీఆర్ఎస్ బలంగా ఉండడం, తన కొడుకు కేటీఆర్ దాన్ని ముందుకు తీసుకెళ్తారనే నమ్మకం కేసీఆర్‌ను జాతీయ బాట పట్టించాయి. రాష్ట్రంలో తమకు ఢోకా లేదు కనుక, రాష్ట్రానికే పరిమితం కాకుండా దేశాన్ని తమవైపు ఆకర్షించి జాతీయ నేతగా ఎదిగి, ప్రధాని కావాలన్నది ఆయన ఆకాంక్షగా కనిపిస్తోంది.