దేశం వెనకబాటుతనానికి బేజేపీ, కాంగ్రెస్ రెండూ ముఖ్య కారణమని, అవి దొందూ దొందేనని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ఆ పార్టీల దేశాన్ని దరిద్రంలోకి నెట్టి కుబేరులకు దోచిపెట్టాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ తొలి బహిరంగ సభలో ఆయన ఆ రెండు జాతీయ పార్టీలను ఏకిపారేశారు.
‘‘దేశంలో అందుబాటులో ఉన్న కరెంటు నాలుగు లక్షల పదివేల మెగావాట్లయితే రెండులక్షల మెగావాట్లకు మించి ఎన్నడూ వాడుకోలేదు. అనేక ప్రాజెక్టులు విద్యుత్ తయారీకి సిద్ధంగా ఉంటే కావాలనే ఏవేవో పంచాయతీలు పెట్టి ఆపుతున్నారు. దేశంలో తెలంగాణలో తప్ప మరెక్కడా 24 గంటల కరెంటు లేదు. అన్ని రాష్ట్రాల్లోనూ కరెంటు కోతలే. బీఆర్ఎస్ లాంటి పార్టీ అధికారంలో వస్తే దేశం రెండేళ్లలోనే వెలుగుజిలుగులతో మెరిసిపోతుంది’’ అని జోస్యం చెప్పారు. దేశానికి అన్నం పెట్టే రైతలను బీజేపీ ప్రభుత్వం గాలికొదిలేసిందని సీఎం మండిపడ్డారు. రైతన్నల ఆత్మహత్యలు దేశానికి సిగ్గుచేటన్నారు. ‘‘రైతులు ఢిల్లీలో ధర్నా చేయాల్సిన పరిస్థితి రావడం సిగ్గుచేటు. మోదీ ప్రభుత్వం తనకిష్టమైనవాళ్లకు ప్రజా సంపదను దోచిపెడుతోంది. రైతులు బాగుపడాలంటే దేశమంతా ఉచిత కరెంటు ఇవ్వాలి. దీనికి లక్షా నలభై ఐదు కోట్లు సరిపోతుంది. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశమంతా రైతులకు ఉచిత కరెంటు ఇస్తాం. విద్యుత్ రంగం ప్రభుత్వ రంగ పరిధిలోనే ఉంటుంది’’ అని భరోసా ఇచ్చారు. దేశానికి ఏదైనా సమస్య వస్తే గట్టెక్కడానికి ప్రజల నుంచి సొమ్ము గుంజుతున్నారని మోదీ సర్కారును దుయ్యబట్టారు. ‘‘ఇది పెట్టుబడిదారుల దోపిడీ ప్రపంచం. మోదీ ప్రభుత్వ విధానం ప్రైవేటీకరణ, మా విధానం జాతీయకరణ. అయ్యా.. మోదీ నువ్వు ఎల్ఐసీని ప్రవేటీకరణ చేయి. 2024 తర్వాత నువ్వు ఇంటికి, మేం ఢిల్లీకి. మేం అధికారంలోకి వచ్చాక ఎల్ఐసీని మళ్లీ జాతీయం చేస్తాం.’’