మసీదు,మందిరం కూల్చడం బాధగా ఉంది.. కొత్తవి కట్టిస్తాం : కేసీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

మసీదు,మందిరం కూల్చడం బాధగా ఉంది.. కొత్తవి కట్టిస్తాం : కేసీఆర్

July 10, 2020

KCR Reacts on Damage to Religious Places

తెలంగాణ సచివాలయం కూల్చివేత పనుల్లో కొంత ఇబ్బందులు తలెత్తాయి. అక్కడే ఉన్న మసీదు, హిందూ ఆలయం స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఈ విషయం సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు. దీనిపై విచారం వ్యక్తం చేశారు. కూల్చివేతల సమయంలో అనుకోకుండా జరిగిన పొరపాటుగా భావించాలని ఆయా నిర్వాహకులను కోరారు. ప్రభుత్వ ఖర్చులతో వాటి స్థానంలోనే కొత్తవాటిని నిర్మాస్తామని హామీ ఇచ్చారు. 

ప్రార్థనా మందిరాలను దెబ్బతీయాలనే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. కాకతాళీయంగా జరిగినదిగానే గుర్తించి సహకరించాలని కోరారు. కొత్త సెక్రటేరియట్‌తో పాటు ప్రభుత్వ ఖర్చుతో ఇంకా విశాలమైన మసీదు, ఆలయాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. లౌకిక స్పూర్తికి ఏ మాత్రం విఘాతం కలగకుండా చూస్తామని అన్నారు. త్వరలోనే ఆయా నిర్వాహకులతో సమావేశమై చర్చిస్తామని చెప్పారు. పాత భవనాల శిధిలాలు ప్రార్థనా మందిరాలపై పడిన విషయం తనకు బాధ కలిగించిందని తెలిపారు. అంతా సహృదయంతో అర్థం చేసుకోవాలని కోరారు. కాగా మంగళవారం నుంచి పాత సచివాలయం కూల్చివేతలను అధికారులు ప్రారంభించారు. దాని స్థానంలో రూ. 500 కోట్లతో కొత్త సచివాలయ నిర్మాణానికి ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే.