సికింద్రాబాద్ ప్యారడైజ్ సమీపంలోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లోని బీఎం5 కాల్ సెంటర్లో గురువారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మరణించారు. అనేక మంది ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ అగ్ని ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో చనిపోయిన వారిపట్ల సీఎం విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపి రూ.3 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. ప్రమాద ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సంబంధింత అధికారులను సీఎం ఆదేశించారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని మంత్రులకు సీఎం సూచించారు.
ఇదిలా ఉండగా అగ్ని ప్రమాదంలో చనిపోయిన మృతుల డెడ్ బాడీలకు గాంధీ మార్చురీలో పోస్ట్‌మార్టం ప్రక్రియ ప్రారంభమైంది. పోలీసులు ఆసుపత్రి పరిసరాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మీడియాను కూడా అనుమతించడం లేదు. పోస్ట్‌మార్టం జరిగిన వెంటనే డెడ్ బాడీస్‌ను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఇప్పటికే మృతుల కుటుంబ సభ్యులు గాంధీకి చేరుకున్నారు. తమ పిల్లలను విగతజీవులుగా చూసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.