దేవుడి పెత్తనమేందని, తనను దేవుడిని చేయాలంటాడేమో! - MicTv.in - Telugu News
mictv telugu

దేవుడి పెత్తనమేందని, తనను దేవుడిని చేయాలంటాడేమో!

March 7, 2018

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించిన థర్డ్ ఫ్రంట్‌పై టీ కాంగ్రెస్ నేత రేవంత రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘రెండు పెగ్గులేస్తే ఫ్రంట్ ఏదో, బ్యాక్ ఏదో తెలియని కేసీఆర్‌కి థర్డ్ ఫ్రంట్ అవసరమా? తెలంగాణలో ఆంధ్రోడి పెత్తనం ఏందని తెలంగాణ రాష్ట్రం కావాలన్నాడు. ఇప్పుడేమో కేంద్రం పెత్తనం ఏంటని ప్రశ్నిస్తూ తనను ప్రధానమంత్రిని చేయాలంటున్నాడు. రేపు ప్రజల మీద దేవుడి పెత్తనమేందని, తనను దేవుడిని చేయాలంటాడేమో!’ అని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ బస్సు యాత్రలో భాగంగా బుధవారం సిరిసిల్లలో జరిగిన సభలో రేవంత్ ప్రసంగించారు. కేంద్రంలో మోడీ దోపీడీ పాలన, రాష్ట్రంలో కేడీ(కల్వకుంట్ల దోపిడి) పాలన కొనసాగుతుందని విమర్శించారు.

మంత్రి కేటీఆర్‌ను విమర్శిస్తూ.. ఆయన భారీగా కమీషన్లు తీసుకుంటున్నారని అన్నారు. బతుకమ్మ చీరలంటూ రూ.150 కోట్ల కమీషన్ కొట్టేసిన చరిత్ర సదరు మంత్రిది అని ఆరోపించారు. హరీశ్ రావు నుంచి  మైనింగ్ శాఖను లాక్కుని కేటీఆర్‌కి కట్టబెట్టారన్నారు. దీన్ని ప్రశ్నించిన హరీశ్‌కు ఇసుక రీచ్‌లను కట్టబెట్టారని, త్వరలో రాజ్యసభకు పంపుతారని అన్నారు.