కేసీఆర్ సర్కార్ మరో నిర్ణయం.. ప్రైవేట్‌ ఫార్మసీలు ఎత్తివేత - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్ సర్కార్ మరో నిర్ణయం.. ప్రైవేట్‌ ఫార్మసీలు ఎత్తివేత

May 17, 2022

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న ప్రైవేట్‌ మందుల దుకాణాలను ఎత్తివేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన రోగులకు ప్రభుత్వమే ఉచితంగా మందులు ఇస్తున్నప్పుడు ఈ ప్రైవేట్ ఫార్మసీలు ఎందుకు కొనసాగించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నిర్ణయంతో.. బోధనాసుపత్రులు, జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లోని ప్రైవేట్‌ ఔషధ దుకాణాలను ఎత్తివేసేందుకు రంగం సిద్ధమైంది.

ఈ క్రమంలో ప్రైవేట్‌ ఫార్మసీల యాజమానులు స్పందిస్తూ..” ఎట్టి పరిస్థితుల్లోనూ ఖాళీ చేయం. అవసరమైతే కోర్టులకు వెళ్లి ఖాళీ చేయించకుండా స్టే తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తాం” అంటూ వారు సమాధానాలు చెప్తున్నట్లు సమాచారం. దాంతో వైద్య, ఆరోగ్యశాఖ చట్టపరమైన చిక్కులు తలెత్తకుండా వాటిని ఎలా ఖాళీ చేయించాలన్న దానిపై కసరత్తు మొదలుపెట్టింది.

తాజాగా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆమోదిస్తూ.. ఎట్టి పరిస్థితుల్లోనైనా ప్రైవేట్‌ మందుల దుకాణాలను ఎత్తి వేయాల్సిందేనని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దాంతో అధికారులు అప్రమత్తమైయ్యారు. ప్రైవేట్‌ ఫార్మసీలను తొలగించేందుకు రంగం సిద్ధం చేశారు. దుకాణాలను ఎత్తివేయడమే కాకుండా, తక్షణమే అన్ని ఆసుపత్రుల్లో ఉచితంగా అన్ని రకాల మందులు, అవసరమైనన్ని సరఫరా చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది.