కేసీఆర్ సర్కార్ మరో నిర్ణయం.. ఆ పోస్టులు తొలగింపు - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్ సర్కార్ మరో నిర్ణయం.. ఆ పోస్టులు తొలగింపు

April 25, 2022

తెలంగాణ రాష్ట్రంలో నేడు, రేపో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ వెలువడనున్నట్లు అధికారులు తెలిపారు. నోటిఫికేషన్‌ను విడుదల చేసే ముందు కేసీఆర్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకొన్నది. గతంలో ప్రకటించిన మైనార్టీ సంక్షేమాధికారుల పోస్టులను గ్రూప్‌-1 నుంచి తొలగించింది. ఇవి ఆరు పోస్టులుండగా, వాటి స్థానంలో కొత్తగా మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌-2 పోస్టులను చేర్చింది.

దీనికి సంబంధించిన జీవోను ప్రభుత్వం జారీచేసింది. జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి (డీఎండబ్యూవో) పోస్టులను గతంలో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ చేయలేదు. అయితే, డిప్యూటేషన్‌, ఫారిన్‌ సర్వీసెస్‌పై మరో శాఖ నుంచి అధికారులను ఆయా పోస్టుల్లోకి తీసుకొనేవారు. తాజాగా గ్రూప్‌-1లో చేర్చినా, భర్తీ చేసేందుకు నిబంధనలు అడ్డుగా నిలిచాయి.

ఈ నేపథ్యంలోనే ఆరు పోస్టులను ఉపసంహరించినట్టు అధికారులు తెలిపారు. తాజా మార్పుతో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌లో మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌-2 పోస్టులు 41కి చేరాయి. పోలీసు శాఖలోని డీఎస్పీ కమ్యూనికేషన్‌ పోస్టుల విద్యార్హతలపైనా ఆ శాఖ అధికారులు స్పష్టతనిచ్చారు. ఇక గ్రూప్‌ -1కి ఉన్న అడ్డంకులు తొలగిపోవడంతో నోటిఫికేషన్‌ జారీకి మార్గం సుగమం అయినట్లు అధికారులు వెల్లడించారు.