KCR Sarkar has a huge offer for new recruits
mictv telugu

కొత్త ఉద్యోగులకు..కొత్త జీతాలు:కేసీఆర్

September 20, 2022

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల నిరుద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగాలే లక్ష్యంగా కొన్ని సంవత్సరాలుగా రాత్రనక, పగలనక కష్టపడి చదువుతున్న అభ్యర్థులకు కేసీఆర్ సర్కార్ ఓ శుభవార్తను తెలియజేసింది. ఇటీవలే విడుదలైన నోటిఫికేషన్లకు దరఖాస్తులు చేసుకొని, జరగబోయే అన్ని పరీక్షల్లో నెగ్గి, కొత్తగా ఉద్యోగం సాధించేవారికి రాష్ట్ర ప్రభుత్వం ఓ బంపర్ ఆఫర్ ఇస్తున్నట్లు ప్రకటించింది. కొత్త పేస్కేల్స్‌ను అమలు చేస్తున్నామని, ఉద్యోగంలో చేరిన కొత్తలోనే వీరంతా మంచి వేతనాలు పొందనున్నారని తెలియజేసింది. ఈ విషయాన్ని ఇటీవలే వెలువరించిన అన్ని నోటిఫికేషన్లలోనూ ప్రకటించామని, పాత పేస్కేల్స్‌ స్థానంలో కొత్త వాటిని నోటిఫై చేశామని పేర్కొంది.

”కొత్త నోటిఫికేషన్లతో ఉద్యోగాలు పొందనున్న వారికి బంపర్‌ ఆఫర్‌ తగిలింది. కొత్తగా ఉద్యోగాలకు ఎంపికయ్యేవారికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త పేస్కేల్స్‌ను అమలు చేయనున్నది. ఉద్యోగంలో చేరిన కొత్తలోనే వీరంతా మంచి వేతనాలు పొందనున్నారు. అంటే పాత పేస్కేల్స్‌ స్థానంలో కొత్త పేస్కేల్స్ నోటిఫై చేశాం. తొలుత 17 వేల పోస్టులతో పోలీసు ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్‌ విడుదలైంది. 503 పోస్టులతో గ్రూప్‌ -1 ఆ తర్వాత మున్సిపల్‌, రవాణాశాఖ, ఇరిగేషన్‌, మహిళా శిశు సంక్షేమ శాఖల్లో పోస్టుల భర్తీ వేగిరమైంది. అన్ని నోటిఫికేషన్లలోనూ ప్రభుత్వం కొత్త పేస్కేల్స్‌ను నోటిఫై చేసింది. మరో పీఆర్సీని ప్రకటించే వరకూ ఇవే వేతనాలు అమల్లో ఉంటాయి” అని అధికారులు ఓ ప్రకటనలో తెలియజేశారు.

ఇక, తెలంగాణలో తాజాగా వెలువడిన నోటిఫికేషన్ల విషయానికొస్తే..పోలీసు ఉద్యోగాలకు సంబంధించి ఇటీవలే ప్రిలిమ్స్ పరీక్ష ముగిసింది. కానీ, ఇంకా రిజల్ట్స్ వెలువడలేదు. ఆ తర్వాత డీఎస్సీకి సంబంధించిన టెట్ పరీక్ష ముగిసి, రిజల్ట్స్ కూడా వచ్చేశాయి. ఇంకా గ్రూప్-1, రవాణాశాఖ, ఇరిగేషన్‌, మహిళా శిశు సంక్షేమ శాఖల్లో వెలువడిన ఉద్యోగాలకు పరీక్షలు జరగాల్సి ఉంది. ఈ క్రమంలో తాజా నోటిఫికేషన్లలో ఉద్యోగాలు సాధించాలని వెయ్యి ఆశలతో ఉన్నవారికి కేసీఆర్ సర్కార్ ముందుగానే కొత్త పేస్కేల్ గురించి ప్రకటించింది.