అభ్యర్థులకు కేసీఆర్ సర్కార్ మరో తీపికబురు..ఇకనుంచి - MicTv.in - Telugu News
mictv telugu

అభ్యర్థులకు కేసీఆర్ సర్కార్ మరో తీపికబురు..ఇకనుంచి

May 3, 2022

తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు కేసీఆర్ సర్కార్ మరో తీపికబురు చెప్పింది. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పోలీస్, గ్రూప్ 1 ఉద్యోగ నోటిఫికేషన్లను దృష్టిలో ఉంచుకొని, ప్రతి జిల్లాలో ఉచిత కోచింగ్ సెంటర్‌ను ప్రారంభించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇకనుంచి ఆ ఉచిత కోచింగ్‌ సెంటర్లకు అదనంగా హైదరాబాద్‌ జిల్లా పరిధిలోని ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

సోమవారం మాసాబ్‌ ట్యాంక్‌లోని తన కార్యాలయంలో ఉచిత కోచింగ్‌ సెంటర్ల ఏర్పాటు, నిర్వహణపై హోంమంత్రి మహమూద్‌ ఆలీతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వారితోపాటు మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొని, ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

మరోపక్క సోమవారం నుంచి పోలీస్ ఉద్యోగాలకు, గ్రూప్ 1 ఉద్యోగాలకు ఆల్‌నైన్‌లో దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. ఉద్యోగాలకు ప్రకటన విడుదల కావడంతో అభ్యర్థులు చాలామంది ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల బాటపడ్డారు. దాంతో యాజమాన్యాలు భారీగా ఫీజులు పెంచడంతో నిరుపేద అభ్యర్థులు డబ్బులు లేక నానా అవస్థలు పడ్డారు. పరిస్థితిని గమనించిన సర్కార్ ఎమ్మెల్యే కోటాలో ఈ ఉచిత కోచింగ్ సెంటర్ల ఏర్పాటుపై నిర్ణయాలు తీసుకుంది.