ఆదివారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ సుదీర్థంగా ప్రసంగించారు.ప్రధానంగా కేంద్ర ప్రభుత్వంలో లోపాలను అసెంబ్లీ వేదికగా ఎండగట్టారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. మోదీ హయాంలో మాత్రం ఒక్కటంటే ఒక్క సెక్టార్‌లోనూ వృద్ధి లేదంటూ మండిపడ్డారు.దేశంలో అన్ని పరిశ్రమలు మూత పడుతున్నా.. రూపాయి పతనమవుతున్నా.. తామే గొప్ప అంటూ జబ్బలు చరుచుకుంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇక దీనిపై ఓ కథ చెబుతూ సభలో సభ్యులచే నవ్వులు పూయించారు కేసీఆర్.
కేసీఆర్ చెప్పిన కథ ఇదే
“ఓ రాజ్యానికి తిరుమల రాయుడు అనే రాజు ఉండేవాడు. ఆ రాజుకు ఒకటే కన్ను ఉండేది. ఇదే విషయంపై ఆయన బాధపడుతుంటాడు. అదే రాజ్యంలో ఓ కవి ఉంటాడు.అతడికి కొన్ని సమస్యలు వచ్చి పడ్డాయి. దీనికోసం రాజుగారి దగ్గర బహుమానం పొందేందుకు అతడిని పొగడాలని స్నేహితులు సలహా ఇస్తారు. దీంతో కవి రాజుదగ్గరికి వెళ్లి “అన్నాతిగూడి హరుడవు..
అన్నాతిని కూడనప్పుడు అసురగురుండవు.. అన్నా తిరుమలరాయ కన్నొక్కటే లేదు గానీ కౌరవ పతివే” అని కవిత్వం చెబుతాడు. అంటే భార్యతో ఉన్నప్పుడు నువ్వు మూడు కళ్ల శివుడవు. ఆయన భార్య రెండు కళ్లతో కలిపి మూడు కళ్లు కలిగినవాడని అర్థం. ఇక భార్యతో లేనప్పుడు రాక్షసుల గురువైన శుక్రాచార్యుడంటి వాడివి. ఆ ఒక్క కన్ను కూడా లేకపోతే నువ్వేమైనా తక్కువ వాడివా కౌరవపతి అంటే ధృతరాష్ట్రుడంతటివాడివి అని పొగుడుతాడు. ఇప్పుడు పార్లమెంట్ లో మోదీ ఉద్దేశించి ఇలాగే పొగుడుతున్నారని కేసీఆర్ సెటైర్లు వేశారు.