వేసంగి వడ్ల సమస్యపై తెలంగాణ ముఖ్యమంత్రి సంచలన ప్రకటన చేశారు. ఈ సీజన్లో పండిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం కొంటుందని హామీ ఇచ్చారు. ఢిల్లీలో దీక్ష చేసి హైదరాబాద్ చేరుకున్న ఆయన ఈ రోజు మధ్యాహ్నం కేబినెట్ సమావేశం నిర్వహించాక విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కేంద్రం ప్రభుత్వం తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. ‘వడ్ల కొనుగోలుపై చీఫ్ సెక్రటరీ తదితరులతో ఒక కమిటీ వేశాం. తక్కువ నష్టంతో ధాన్యం మొత్తం కొనుగోలు చస్తాం. ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. గోనె సంచులు వంటి సదుపాయాలన్నీ పౌర సరఫరాలశాఖ కల్పిస్తుంది. మూడు నాలుగు రోజుల్లో మొత్తం కొంటారు. రైతులు ఒక్క గింజ కూడా తక్కువకు అమ్మొద్దు. మద్దతు ధర 1960 రూపాయాలు మేం చెల్లిస్తాం. రాష్ట్రంలో సమర్థవంతమైన ప్రభుత్వం ఉంది.. రాష్ట్రంలో వ్యవసాయం కళకళలాడుతోంది..’ అని కేసీఆర్ తెలిపారు. సస్యశ్యామల రాష్ట్రం దెబ్బతినకుండా ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలని నిర్ణయించామని చెప్పారు.