కేసీఆర్ నాపై చర్యలు తీసుకోవాలి.. డీఎస్ - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్ నాపై చర్యలు తీసుకోవాలి.. డీఎస్

January 20, 2020

CM KCR.

కేసీఆర్‌కు దమ్ముంటే తన మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ డీ.శ్రీనివాస్ ఛాలెంజ్ విసిరారు. తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలను డీఎస్ ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని వీడి చరిత్రాత్మక తప్పిదం చేశానని.. తండ్రి, కొడుకు, కూతురు బాగుపడితే బంగారు తెలంగాణ అయినట్లా? అని కేసీఆర్‌ను ఉద్దేశించి మాట్లాడారు. 

తన తల్లి చనిపోయినప్పుడు కనీసం ఒక్క మంత్రి, ఎమ్మెల్యే కూడా వచ్చి పరామర్శించలేదని ఆరోపించారు.  ‘మంత్రి ప్రశాంత్ రెడ్డి తల తిక్క మాటలు మానుకోవాలి. నాపై ఆయన చేసిన విమర్శలను ఖండిస్తున్నాను. నేను చేసింది తప్పు అని నిరూపించే ధైర్యం ఉంటే నన్ను ఇప్పటికైనా సస్పెండ్ చెయ్యరు ఎందుకు. కొంత మంది ఎమ్మెల్యేలకు ఇష్టం లేకున్నా నా సస్పెన్షన్ తీర్మానంపై సంతకాలు చేశారు. సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే నాపై చర్యలు తీసుకోవాలి. దిగ్విజయ్ సింగ్ నాపై సోనియాకు తప్పుడు రిపోర్ట్ ఇవ్వడంతోనే మనస్తాపం చెంది ఆ పార్టీ నుంచి తప్పుకున్నాను’ అని డీఎస్ వెల్లడించారు.