అక్కా.. అంటూ కన్నీరు మున్నీరైన కేసీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

అక్కా.. అంటూ కన్నీరు మున్నీరైన కేసీఆర్

February 21, 2018

‘రక్తసంబంధం.. ఇదే రక్తసంబంధం.. హృదయాలను కలిపేది.. కలకాలం నిలిచేది నిజమైన జన్మబంధం..’ ఇలా ఎన్ని చెప్పినా రక్తసంబంధం విలువ మాటలకు అందనిది. ఒక తల్లి కడుపున పుట్టిన పిల్లలు రెక్కలొచ్చి పెద్దయ్యాక ఎక్కడెక్కడికో వెళ్లిపోతారు.

కానీ వారి హృదయాలను రక్తసంబంధం ఆజన్మాంతం నిత్యం కలిపే ఉంచుతుంది. ఆటపాటలు, చిరుతిళ్లు ఇచ్చిపుచ్చుకోవడాలు.. వంటి మరెన్నో బాల్యపు తీపిగురుతులు నెమరువేసుకుంటూనే ఉంటారు. తల్లి వద్ద ఎంగిలిపాలు తాగిన ఆ బంధాలు ఈ నేలపై మన కట్టెకాలేవరకు పదిలంగా ఉంటాయి.

పదిమంది తోబుట్టువులున్న సీఎం కేసీఆర్‌కు రక్తసంబంధాల బలం మరింత ఎక్కువ. ఆయన రెండో అక్క విమలా బాయికి తుది వీడ్కోలు చెబుతూ సీఎం చిన్నపిల్లాడిని కన్నీరుమున్నీరయ్యారు. తనను చిన్నప్పుడు ఎత్తుకుని, ముద్దు చేసిన ఆడించిన సోదరిని తలుచుకుంటూ.. అక్కా.. ఈ తమ్ముణ్ని విడిచిపెట్టి ఎట్ల పోతివే అని భోరున విలపించారు. ఆ దృశ్యాలు చూస్తున్నవారూ కంటతడి పెట్టారు.

82 ఏళ్ల విమలా బాయి బుధవారం అనారోగ్యంతో హైదరాబాద్‌లో చనిపోయారు. ఆమె అంత్యక్రియలను మధ్యాహ్నం ఆల్వాల్ లోనిర్వహించారు. కేసీఆర్, హరీశ్ రావు తదితరులు హాజరై తుది వీడ్కోలు పలికారు.