KCR SPEECH IN MAHARASTRA BRS MEETING
mictv telugu

రైతుల ఆత్మహత్యలు ఇంకా ఎన్నాళ్లు ? :కేసీఆర్

February 5, 2023

KCR SPEECH IN MAHARASTRA BRS MEETING

దేశానికి అన్నం పెట్టే రైతన్నలు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. పార్టీలు, ప్రధానులు మారినా.. దేశ పరిస్థితులు మారలేదని ధ్వజమెత్తారు. దేశంలో ఇప్పటికీ సరైన సాగునీరు, కరెంట్ లేదని విమర్శించారు. నాందేడ్‌లోని సచ్‌ఖండ్ బోడో మైదానంలో ఏర్పాటు చేసిన సభకు సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా స‌భా వేదికపై డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్, మ‌ర‌ఠా యోధుల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ పుష్పాంజ‌లి ఘ‌టించి, నివాళుల‌ర్పించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసగించారు. ప్రధానంగా బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టారు. బీఆర్ఎస్(BRS)ను గెలిపిస్తే మహారాష్ట్రలో అద్భుతాలు చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా రైతులకు ఉచిత కరెంట, సాగు నీరు అందాలని డిమాండ్ చేశారు.

రెండు పార్టీలే దోషులు

మతాలు, జెండాలు, కులాల పేరుతో దేశంలో మార్పు వస్తుందనుకోవడం మూర్ఖత్వం అని సీఎం కేసీఆర్ అన్నారు. “75 ఏళ్లలో రెండే రెండు పార్టీలు దేశాన్ని ఏలాయి. కానీ ఏం జరిగింది. ఈ వెనుకబాటు తనానికి కాంగ్రెస్, బీజేపీ పార్టీలే దోషులు. ఒకరు అంబానీ అంటే మరొకరు అదానీ అంటారు. ఇది రాజకీయం కాదు జీవన్మరణ సమస్య. జెండా రంగులను చూసి ప్రజలు మోసపోతున్నారు. ఈ దేశానికి లక్ష్యం ఉందా ? 75 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత కూడా కనీసం తాగునీరు, విద్యుత్ ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి. మహారాష్ట్రలో రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు” అని కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ పథకాలు మహారాష్ట్రలో ఎందుకు లేవన్నారు.

రైతు రాజ్యం కావలి

“దేశానికి అన్నం పెట్టే రైతన్నలు ఆత్మహత్య చేసుకోవడం బాధిస్తోంది. అన్నధాతలకు ఆ అవసరం ఎందుకు వచ్చింది. ప్రస్తుత నేతలు మాటలకే పరిమితం అవుతున్నారు.దేశ జనాభాలో 42 శాతం రైతులే. రైతులు పండించిన పంటను వారే అమ్ముకోవాలి అప్పుడే రైతు రాజ్యం అవుతుంది. ప్రజలకు సమస్యలు అర్థమైనప్పుడు.. మేం బలవంతులం అనుకునే నేతల పతనం తప్పదు.భారత్‌లో ఉన్నంత సాగు యోగ్యమైన భూమి ప్రపంచంలో మరెక్కడ లేదు. ఇన్నేళ్లయినా తాగునీరు లేదు, సాగులేదు, కరెంటు లేదు.దేశానికి అన్నంపెట్టే రైతన్న ఉసురు తీసుకోవడం ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు. దేశ జనాభాలో వ్యవసాయ కూలీలు 50 శాతం కంటే ఎక్కువ మంది ఉన్నారు. రైతుల్లో చైతన్యం వస్తే సర్కారు సాకారం అవుతుంది రైతులు ఎంతో కష్టపడి పండించినా చివరకు ఆత్మహత్యలు తప్పట్లేదు. అందుకే ‘అబ్‌కీ బార్..కిసాన్ సర్కార్’ నినాదంతో బీఆర్ఎస్ ఏర్పడింది. నాగలి పట్టే చేతులు..శాసనాలు చేయాల్సిన రోజులు వచ్చాయి ” అని కేసీఆర్ తెలిపారు.

మేకిన్ ఇండియా..జోకిన్ ఇండియా

“భారత దేశం పేద దేశం కాదు. భారత్‌ మేధావుల దేశం. భారత్‌ అమెరికా కంటే ఆర్థికవంతమైన దేశంగా ఎదగడం అసాధ్యం కాదు. మేకిన్ ఇండియా..జోకిన్ ఇండియాగా మారింది. ఏ పల్లెకు వెళ్లి చూసినా చైనా వస్తువులే, చైనా బజార్లే కనిపిస్తున్నాయి. మాంజా నుంచి జాతీయ జెండాల వరకు నుంచేనా ? చైనా బజార్లు పోయి భారత బజార్లు రావాలి” అని కేసీఆర్ స్పష్టం చేశారు.