కేసీఆర్ పిట్టకథ.. ఆర్టీసీ ఉద్యోగుల నవ్వులే నవ్వులు.. - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్ పిట్టకథ.. ఆర్టీసీ ఉద్యోగుల నవ్వులే నవ్వులు..

December 1, 2019

ప్రగతి భవన్ వేదికగా నేడు ఆర్టీసీ ఉద్యోగులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆత్మీయ సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికై ముఖ్యమంత్రి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. కార్మికులు అందరితో కేసీఆర్ చాలా ఆత్మీయంగా సభ నిర్వహించారు. ఉద్యోగులు సమ్మె చేసిన 55 రోజులకు కూడా వేతనం చెల్లిస్తామని ప్రకటించారు. ఉద్యోగులు ఇంక్రిమెంట్ యధావిధిగా ఇస్తామని వెల్లడించారు.

సమ్మె కాలంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబంలో ఒకరికి ఎనిమిది రోజుల్లో ఉద్యోగం ఇవ్వాలని స్పష్టంచేశారు. ప్రతీ కుటుంబానికి ప్రభుత్వం తరుఫున రెండు లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని పేర్కొన్నారు. దీంతో కార్మికులు తమ కరతాళ ధ్వనులతో హర్షం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మధ్యమధ్యలో ఛలోక్తులు విసిరారు. దీంతో సమావేశంలో నవ్వులు విరిశాయి. 

KCR Story.

ఈ సందర్భంగా కేసీఆర్ ఓ పిట్టకథ చెప్పారు. ప్రతి పని చేసేటప్పుడు చెడగొట్టేవాళ్ళు ఉంటారని చెబుతూ ముఖ్యమంత్రి రామాయణ యుద్ధం గురించి ప్రస్తావించి ఆర్టీసీ ఉద్యోగులను కడుపుబ్బా నవ్వించారు . యుద్ధంలో రామబాణం వల్ల అర్ధాయుష్షుతో మరణించిన రాక్షసులు కొందరు తమ పరిస్థితి ఏమిటని రాముణ్ణి అడిగినప్పుడు కలియుగంలో మీరు అక్కడక్కడా పుట్టండి అంటారు. అలా పుట్టిన వారే మనుషులను పీక్కు తింటున్నారని,  వారే ఆర్టీసీలో అందరినీ ఇబ్బంది పెడుతున్నారు అంటూ ముఖ్యమంత్రి అనడంతో సమావేశంలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి.

సమావేశం అనంతరం ముఖ్యమంత్రి, కార్మికులతో కలిసి భోజనం చేశారు. భోజనం చేసే సమయంలో డ్రైవర్లు , కండక్టర్లతో ఆత్మీయంగా మాట్లాడి వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు . సీఎం చాలా ఆప్యాయంగా పలకరించడంతో మహిళా కండక్టర్లు తమ సమస్యలను వివరించారు.