KCR Stratagy..BJP Shocked
mictv telugu

కేసీఆర్ రింగ్ వల…బీజేపీ విలవిల..!

October 28, 2022

కేసీఆర్ లెక్కవేరు..స్ట్రాటజీ వేరు.ఎత్తు వేస్తే ప్రత్యర్థి గిలగిల కొట్టుకోవాలి. టైమింగ్ చూసి వదిలే బాణం మామూలుగా ఉండదు. కోలుకునే టైమ్ కూడా ఇవ్వరు. డ్యామేజ్ కంట్రోల్‌కు కిందామీదపడాల్సిందే. ఇప్పుడు సరిగ్గా రాష్ట్రంలో ఇదే జరుగుతోంది. కేసీఆర్ వదిలిన రింగు వలకు చిక్కి బీజేపీ విలవిల్లాడుతోంది. కుట్రకోణంతో సంబంధం లేదని చెప్పడానికి చేయని ప్రయత్నమంటూ లేదు. మునుగోడు బై ఎలక్షన్‌ని వదిలేసి బండి సంజయ్ యాదాద్రికి వెళ్లారు. ఎమ్మెల్యేల కొనుగోళ్ల విషయంలో బీజేపీకి సంబంధం లేదంటూ నరసింహాస్వామి సాక్షిగా ప్రమాణం చేశారు. మిగతా నేతలంతా ఖండించే పనిలోనే ఉన్నారు. కేసీఆర్ కు కావాల్సింది కూడా ఇదే.

ఆకర్ష్ గాలం వర్సెస్ రింగ్ వల

తెలంగాణలో రాజకీయ గాలం వేసి బీజేపీ ఒక్కొక్కరినీ పడుతోంది. చేరికల కమిటీని ఏర్పాటు చేసి ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగిస్తుంది. ఈటల రాజేందర్ నుంచి మొదలైన పరంపర కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు మీదుగా సాగుతూనే వుంది.8 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు..కాదు కాదు 14 మంది టీఆర్ఎస్ నేతలు టచ్ లో ఉన్నారని కేసీఆర్‌ని బీజేపీ నేతలు రెచ్చగొట్టి వదిలేశారు.రాబోయే ఎన్నికలనాటికి కారు దిగే వాళ్లు చాలామంది ఉన్నారని ఆ పార్టీ చెబుతూ వస్తుంది. అంతేకాదు తెలంగాణలో రాబోయేది డబుల్ ఇంజన్ సర్కార్ అని కమలం కవ్విస్తోంది. ఇంతకాలం చూసి చూసి కేసీఆర్ ఒక్కసారి రింగ్ వల వేశారు. అదీ మునుగోడు ఎన్నికల టైమ్‌లో. సడెన్ ఇచ్చిన రిటర్న్ గిప్ట్ కు కమలం గిలగిల కొట్టుకుంటోంది.

సవాళ్ల నుంచి ప్రమాణం దాకా…

ఫామ్‌హౌజ్ స్కెచ్ బీజేపీని షేక్ చేస్తోంది. డ్యామేజ్‌ని కంట్రోల్ చేసుకోలేక సెగలు కక్కుతోంది. ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి కేంద్రమంత్రుల నుంచి రాష్ట్రనేతలదాకా ఖండిస్తున్నారు.ఓ అడుగు ముందుకేసిన స్టేట్ బీజేపీ చీఫ్ బండి సంజయ్..దమ్ముంటే యాదాద్రిలో ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. ఈ సవాల్ ఆ నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కాదు..ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్కే. సవాల్ చేసిన మరుసటిరోజే బండి సంజయ్ యాదాద్రి వెళ్లారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంతో బీజేపీకి సంబంధం లేదని నరసింహాస్వామీ సాక్షిగా ప్రమాణం చేసేశారు.నీతి,నిజాయితీ ఉంటే కేసీఆర్ వచ్చి ప్రమాణం చేయాలన్నారు.

ఆ ఆడియోలు ఫేక్…బండి

యాదాద్రిలో ప్రమాణం చేసిన బండి సంజయ్..ఫామ్‌హౌజ్ ఎపిసోడ్‌లో బయటకొచ్చిన ఆడియోలపై రియాక్ట్ అయ్యారు. ఈ ఆడియోలు ఫేక్ అని బండి ఆరోపించారు. వీటిని తయారు చేయడానికి టీఆర్ఎస్ కు రెండ్రోజులు పట్టిందన్నారు. తప్పు చేశారు కాబట్టే సీఎం కేసీఆర్ యాదాద్రికి రావడం లేదని ఆయన ఆరోపించారు. నిబద్ధతతోనే తడిబట్టలతో స్వామీ సాక్షిగా ప్రమాణం చేశానని బండి సంజయ్ అన్నారు.

మునుగోడు డైవర్ట్

ఫామ్‌హౌస్ ఎపిసోడ్‌తో మునుగోడు బై పోల్ క్యాంపెయిన్ డైవర్ట్ అయింది. అందరూ దీనిమీదే మాట్లాడుతున్నారు.బీజేపీ కీలక నేతలంతా డ్యామేజ్ కవరేజ్ పనిలోపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు కావాల్సింది ఇదే. పోలింగ్‌కు నాలుగైదు రోజుల ముందు కమలం నేతల్ని కలవరపెట్టారు. మునుగోడులో ఓట్ల గురించి ఆలోచించలేని విధంగా రింగ్ వల విసరారు. దీన్ని నుంచి బయటపడలేక బీజేపీ సతమతమవుతోంది.