KCR sweet kaburu to employees..Pension guidelines issued
mictv telugu

ఉద్యోగులకు కేసీఆర్ తీపికబురు..పింఛన్‌ మార్గదర్శకాలు జారీ

August 31, 2022

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం..ఆయా ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్న వారి విషయంలో మరో ముందడుగు వేసింది. కంట్రిబ్యూటరీ పింఛన్‌ స్కీం (సీపీఎస్‌) పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు..కుటుంబ పింఛన్‌ మంజూరు చేసే విషయంలో మార్గదర్శకాలను జారీ చేసింది. సర్కార్ విడుదల చేసిన కొత్త మార్గదర్శకాలపై తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పింఛన్‌ పథక ఉద్యోగుల యూనియన్‌ (టీఎస్‌సీపీఎస్‌ఈయూ) హర్షం వ్యక్తం చేసింది.

విడుదల చేసిన మార్గదర్శకాల్లో.. ”ఉద్యోగి చనిపోయిన లేదా విధులు నిర్వర్తించలేని స్థితిలో ఉన్న అతని చివరి నెలలో డ్రా చేసే వేతనంలోని 33 శాతాన్ని అతని కుటుంబానికి పింఛన్‌ కింద ఇస్తాం. గతంలో ఉద్యోగి వేతనం నుంచి కంట్రిబ్యూటరీ పింఛన్‌ను మినహాయించుకోకపోయినా, పింఛన్‌ కోసం శాశ్వత అకౌంట్‌ నెంబర్‌ (ప్రాన్‌) లేకపోయినా ఈ పింఛన్‌ వర్తిస్తుంది. ఈ ఉత్తర్వులు రాకముందే చనిపోయి లేదా ఉద్యోగ విధుల్లో లేకుండా ఉండి అరకొర పింఛన్‌తో వెళ్లదీస్తోన్న ఉద్యోగుల కుటుంబాలకు కూడా ఈ పింఛన్‌ వర్తిస్తుంది. దీని ద్వారా 1,500 మంది ఉద్యోగుల కుటుంబాలకు పింఛన్‌ మంజూరు అయ్యే మార్గం సుగమం అయింది” అని పేర్కొంది.

అంతేకాదు, గతేడాది జూన్‌ 11న ఇచ్చిన ఉత్తర్వులకు అనుగు­ణంగా మార్గదర్శకా­లతో సర్క్యులర్‌ను రాష్ట్ర ట్రెజరీ శాఖ మంగళవారం అన్ని జిల్లాలకు పంపింది. దీంతో కుటుంబ పింఛన్‌ కోసం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసిన..రాష్ట్ర ప్రభుత్వానికి, ట్రెజరీ అండ్‌ అకౌంట్స్‌ శాఖ డైరెక్టర్‌కు యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు జి.స్థితప్రజ్ఞ కృతజ్ఞతలు తెలిపారు. తమ యూనియన్‌ వినతి మేరకు ప్రభుత్వం సర్క్యులర్‌ జారీ చేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. రాష్ట్ర యూనియన్‌ తరుపున కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నామని పేర్కొన్నారు.