టీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితిగా మారబోతోందా? బీఆర్ఎస్ అజెండా ఏమిటి? - MicTv.in - Telugu News
mictv telugu

టీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితిగా మారబోతోందా? బీఆర్ఎస్ అజెండా ఏమిటి?

April 27, 2022

సంచలన రాజకీయాలకు మారుపేరైన కేసీఆర్ బుధవారం టీఆర్ఎస్ ప్లీనరీలో ఎన్నో అంశాలను ప్రస్తావించారు. అయితే అన్నిటికంటే ఆయన నోటంట వెలువడిన ‘బీఆర్ఎస్’ ప్రస్తావన అటు పార్టీ శ్రేణుల్లో, రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ‘తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చాలంటున్న ప్రతిపాదన వస్తోంది’ అని గులాబీ దళపతి అన్నారు.

జాతీయ ప్రయోజనాల కోసం టీఆర్ఎస్‌ను భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)గా మార్చాల్సిన అవసరముందని ఎమ్మెల్యే గాదరి కిశోర్ రాసిన వ్యాసాన్ని ఉటంకిస్తూ కేసీఆర్ ఈ మాట అన్నారు. నిజానికి ఇది కొత్త ప్రతిపాదనేం కాదు. జాతీయ రాజకీయాల్లో తమ వంతు పాత్ర పోషిస్తామని కేసీఆర్ ఇదివరకు, ఇప్పుడూ పదేపదే అంటున్న విషయం, బీజేపీ, కాంగ్రెస్‌లకు సమాఖ్య స్ఫూర్తితో కూడిన ప్రత్యామ్నాయం కావాలని చెబుతుండడం తెలిసిందే.

టీఆర్ఎస్ నిజంగానే దేశ రాజకీయాల్లో వెళ్తే, ప్రాంతీయతను చాటే ‘టీఆర్ఎస్’ పేరు సొసగదు. అందుకు ప్రత్యామ్నాయం ఎంచుకోవాల్సి వస్తుంది. ‘భారత రాష్ట్ర సమితి’ సరైన ఎంపిక. రాష్ట్రం అంటే తెలుగువారికి తెలంగాణ, ఏపీ, తమిళనాడులా ఏదో ఒక రాష్ర్టమనే అర్థం. అయితే రాష్ట్రం అంటే ఉత్తరాది ప్రజలకు దేశమని అర్థం. జాతీయ గీతాన్ని ‘రాష్ట్ర గీత్, రాష్ట్ర గాన్’, జాతీయ పక్షి నెమలిని ‘రాష్ట్రీయ పక్షి’ అని అంటారు. కాబట్టి ‘భారత రాష్ట్ర సమితి’ దక్షిణాదివారికీ వ్యవహారంలో సులువే.
పేరు సంగతి పక్కన బెడితే జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌కు తొలి నుంచీ ఆసక్తే. కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవంతో ఆయన జాతీయ పార్టీ నాయకులతో పరిచయాలు ఉన్నాయి. అటు మమతా బెనర్జీ దగ్గర్నుంచి, ఇటు స్టాలిన్ వరకు చాలామంది ప్రాంతీయ పార్టీల నేతలను ఆయన కలిశారు.

‘ఊరక రారు మహానుభావులు’ అన్న చందంగా, మనసులో ఏమీ లేకపోతే కేసీఆర్ ‘బీఆర్ఎస్’ అనరు. జాతీయ పార్టీలతో, లేకపోతే ప్రాంతీయ పార్టీలతో కలసి దేశ రాజకీయాల్లో చురుగ్గా ఉండడానికే పరిమితం కాకూడదని ఆయన తాజా వ్యాఖ్యలు చెబుతున్నాయి. ‘బీజేపీని గద్దె దించడం చెత్త ఆలోచన. ఒకరిని గద్దె దింపి, మరొకర్ని గద్దె ఎక్కించడం మన పని కాదు. గద్దె ఎక్కించాల్సింది పార్టీలను కాదు, ప్రజలను. ఇప్పుడు కావాల్సింది ప్రత్యామ్నాయ రాజకీయం కాదు, ప్రత్యామ్నాయ అజెండా. దేశంలో కొత్త రాజకీయ శక్తి ఆవిర్భావించాలి. సందర్భానుసారం స్పందించే గుణం ఉండాలి. దేశంలో తుఫాన్‌ను సృష్టించి దుర్మార్గాలను తరిమేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. దానికోసం టీఆర్ఎస్ ఉజ్వలమైన పాత్ర పోషిస్తుంది’ అని కేసీఆర్ ప్లీనరీలో అన్నారు.

కేసీఆర్ నిజంగానే టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారుస్తారా? లేకపోతే టీఆర్ఎస్‌ను అలాగే ఉంచి, దేశ రాజకీయాల కోసం బీఆర్ఎస్ ఏర్పాటు చేస్తారా? అన్న ప్రశ్నలకు వచ్చే పార్లమెంటు ఎన్నికల వరకు ఎదురు చూడాల్సిందే.