ప్రొఫెసర్ కేసీఆర్.. విపక్షాలకు ఎకనమిక్స్ పాఠాలు - MicTv.in - Telugu News
mictv telugu

ప్రొఫెసర్ కేసీఆర్.. విపక్షాలకు ఎకనమిక్స్ పాఠాలు

March 27, 2018

ప్రపంచ తెలుగు మహాసభల్లో అనర్గళంగా పద్యాలుపాడి తెలుగు అధ్యాపకుడి అవతారం ఎత్తిన సీఎం కేసీఆర్ మంగళవారం అసెంబ్లీలో ఎకనమిక్స్ ప్రొఫెసర్‌లా మారిపోయారు. బడ్జెట్, ప్రొవిజనల్ ఎస్టిమేషన్, కేపిటల్ ఇన్‌వెస్ట్‌మెంట్, మొబిలైజేషన్ అడ్వాన్స్,  ప్రాజెక్ట్ హైపోతికేషన్, అప్రాప్రియేషన్.. వంటి మరెన్నో ఆర్థిక అంశాలపై పాఠాలు బోధించారు. విపక్ష నేతల విమర్శలను ప్రస్తావిస్తూ, వాటికి గణాంకాలతో గట్టిగా సమాధానాలిచ్చారు. కొత్తసీసాలో పాతసారాలా విమర్శలు చేస్తున్నారని, మనకు కావాల్సింది నిర్మాణాత్మ విమర్శలని హితవు పలికారు. మధ్యమధ్యలో సటైర్లు వేస్తూ ఉత్సాహపరిచారు.

మంగళవారం శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరిగింది. బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య తదితరులు ప్రభుత్వ తీరును విమర్శించారు. చెల్లింపుల్లో జాప్యం జరుగుతుందోని, రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతింటోందని ఆరోపించారు. దీనికి కేసీఆర్ బదులిస్తూ.. ఆ విమర్శలన్నీ నిరాధారామని, అక్కసుతో ఇలా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ధనిక రాష్ర్టం కాబట్టి ఠంచనుగా చెల్లింపులు జరుగుతున్నాయన్నారు.  

కిషన్, సున్నం.. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడండి..

Related image

‘కిషన్ రెడ్డీ.. మీరు పెద్ద నాయకుడు కావాలని కోరుకుంటున్నాను.. కానీ వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలి. ఎవరో ఏదో అన్నారని.. అసెవబ్లీకొచ్చి ఆ  మాటలను వల్లెవేయడం సరికాదు..’ అని కేసీఆర్ అన్నారు. కిషన్ ఆరోపణల కొట్టిపారేస్తూ లెక్కలు చూపారు. ‘కేపిటల్ ఇన్‌వెస్ట్‌మెంట్ 224 శాతం పెరిగింది. కిషన్ రెడ్డి, సున్నం రాజయ్యలు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి. బడ్జెట్ కాబట్టి ప్రభుత్వాన్ని విమర్శించాలనే ధోరణితో కాకుండా సరైన ఆధారాలతో ఆరోపణలు చేయాలి. కొత్తసీసాలో పాతసారాలా విమర్శలు చేయకండి. 2004 నుంచీ చూస్తున్నాను. బడ్జెట్ ప్రవేశపెడితే ఆహా ఓహో అని అధికార పక్షం పొడుగుతుంది. విపక్షాలు విమర్శిస్తాయి.. ఈ ధోరణి మారాలి’ అని కోరారు.

‘మేం అవినీతిని నిర్మూలించాం. ప్రతి పైసాకు లెక్కలు చూపుతున్నాం. జాతీయ తలసరి ఆదాయానికంటే తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువ… అది రూ. 175,534.  డిస్కంలకు రూ. 35వే కోట్ల అప్పులు ఉన్నాయని కిషన్ ఆరోపించారు. కానీ అసలు విషయం వేరే ఉంది. కంపెనీలు ప్రొజెక్షన్స్ చూపుతాయి. అప్పులు తీసుకుంటాయి, చెల్లిస్తుంటాయి. వ్యాపారంలో అదొక భాగం. దాన్ని ప్రాజెక్ట్ హైపోతికేషన్ అంటారు. ప్రభుత్వం బ్రాడ్ గ్యారంటీ ఇస్తుంది.’ అని కేసీఆర్ వివరించారు.

బీజేపీ రాష్ట్రాలకంటే ఎక్కువ.. నా కవిత్వం కాదు..

Image result for kcr in assembly

గత ప్రభుత్వాలు ఉద్యోగులతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్నాయని, తమ ప్రభుత్వం వారికి భారీగా జీతాలు ఇస్తోందని కేసీఆర్ తెలిపారు. ‘బీజేపీ పాలిత రాష్ట్రాల్లోకంటే మేం 19 శాతం ఎక్కువ జీతాలు ఇస్తున్నాం.. ఏటా 1100 కోట్ల భారం పడుతోంది. యూపీఏకంటే బీజేపీనే తెలంగాణకు ఎక్కువ నిధులు ఇచ్చిందని కిషన్ అన్నారు. అది తప్పు. రాష్ట్రాలు బిచ్చెమెత్తుకోవడం లేదు. వాటి న్యాయమైన వాటాకోసం పోరాడుతున్నాయి. కేంద్ర బడ్జెట్ పెరుగుతున్నట్లే రాష్ట్రాల వాటా కూడా పెరగాలి. ఈ దేశాన్ని సాకే 7 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. 50 వేల కోట్ల తెలంగాణ నుంచి కేంద్రానికి వెళ్లున్నాయి. వస్తున్నది మాత్రం 24 వేల కోట్లే. ఇవి లెక్కలు.. నా కవిత్వం కాదు.. అధికారిక లెక్కలు.. 3500 మంది రైతులు చనిపోయారని అంటున్నారు? దీనికి ఆధారాలేంటి? మేం రైతులను ఎన్నో రకాలుగా ఆదుకుంటున్నాం’ అని స్పష్టం చేశారు. మైనారిటీల కోసం కేవలం 800 కోట్లే ఇచ్చారన్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చేసిన ఆరోపణలు కూడా కేసీఆర్ తోసిపుచ్చారు. ఇప్పటికే 1000 కోట్లకుపైగా ఇచ్చామని, మరో 150 కోట్లు కూడా ఇస్తామని చెప్పారు.

కరీంనగర్ లండన్ నగరంలా మారిపోతుందని, లోయర్ మానేర్ డ్యాం కింద 90 కి.మీ. సుందరీకరణ పనులు చేస్తున్నామని వెల్లడించారు. 500 కోట్లతో కరీంనగర్‌కు రూ. 500 కోట్ల టూరిజం ప్యాకేజీ మంజూరు చేశామన్నారు. తెలంగాణ వచ్చాక రాష్ట్రం గణనీయంగా అభివృద్ధి చెందిందన్నారు. అభివృద్ధిని అడ్డుకోవద్దని, వేల ఎకరాల్లో ఏర్పాటవుతున్న ఫార్మాసిటీతో వేలమందికి కొలువులు వస్తాయని అన్నారు.