అవసరమున్న లేకున్నా పక్క రాష్ట్రాలతో సఖ్యత అవసరం - MicTv.in - Telugu News
mictv telugu

అవసరమున్న లేకున్నా పక్క రాష్ట్రాలతో సఖ్యత అవసరం

November 22, 2017

ప్రపంచ తెలుగు మహాసభల నేపథ్యంలో సీఎం కేసీఆర్ మంగళవారం ప్రగతి భవన్‌లో సమావేశం నిర్వహించారు. తెలుగు పండితులు, రచయితలు, కవులతో ముచ్చటించారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటలవరకు సమావేశం జరిగింది. మహాసభలపై తన అభిప్రాయాలను, లక్ష్యాలను సీఎం వివరించారు. మిగతా వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని కార్యక్రమాలను రూపొందించాలని మహాసభల బాధ్యులకు సూచించారు. సలహాలు ఇచ్చిన వారందరి పేర్లనూ ప్రస్తావిస్తూ మాట్లాడారు. తెలుగు భాషపై తనకున్న పట్టును ప్రదర్శించారు.తెలంగాణ ఉద్యమకారులకు తెలుగు మహాసభలపై ఉన్న అభ్యంతాలను తొలగించే ప్రయత్నం చేశారు. ‘ఎవరికి ఇష్టమున్నా లేకున్నా పక్క రాష్ట్రాలతో సఖ్యత అవసరం. ఇయ్యళ్ల ఉన్నయి, రేపుండవ్. తరాలు మారుతుంటాయ్, అభిప్రాయాలు మారుతుంటయ్. ఎక్కడ కూడా సంకుచితంగా మనం ఉండొద్దు. సంస్కారం విడిచిపెట్టొద్దు.. మన తెలంగాణ సంస్కారం ఎంత గొప్పదో ప్రపంచానికి అర్థమయ్యేటట్టు మహాసభలను నిర్వహించాలి’ అని అన్నారు.  సమావేశం ప్రారంభంలో ఆయన తన చిన్ననాటి గురువైన మృత్యుంజయ శర్మ వచ్చారా లేదా అని వాకబు చేశారు. అనారోగ్యం వల్ల ఆయన రాలేకపోయారని అధికారులు చెప్పారు.