టీడీపీ మంత్రుల రాజీనామా కేసీఆర్‌కు ముందే తెలుసా? - MicTv.in - Telugu News
mictv telugu

టీడీపీ మంత్రుల రాజీనామా కేసీఆర్‌కు ముందే తెలుసా?

March 8, 2018

దేశానికి కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయ పార్టీలు ఒరగబెట్టిందేమీ లేదని, వాటికి ప్రత్యామ్నాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పడాల్సిన అవసరం ఉందని టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం తెలిసిందే. అయితే ఈ ప్రకటన అంత ఆషామాషీగా చేసింది కాదని తాజా రాజకీయాలను చూస్తే అర్థమవుతోంది. దక్షిణాదిలో బీజేపీపై వ్యతిరేకతను కేసీఆర్ బాగానే అధ్యయనం చేసినట్లు కనిపిస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా కేంద్ర కేబినెట్‌లోని తమ మంత్రులతో రాజీనామా చేయించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీసుకున్న సంచలన నిర్ణయం గురించి కూడా కేసీఆర్ ముందే ఊహినట్లు రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.ఏపీకి ప్రత్యేక హోదా ఉద్యమం కేవలం నిరసనలు, ధర్నాలు, పార్లమెంటులో వెల్‌లలోకి దూసుకెళ్లడంతో ఆగదని, మరింత తీవ్రం అవుతుందని కేసీఆర్ భావించారు. తెలంగాణ సెంటిమెంట్‌పై పెద్ద ఉద్యమాన్ని నిర్మించిన ఆయన.. ఏపీలో హోదా సెంటిమెంట్ దశను, దిశలను అవగాహన చేసుకున్నారు. ప్రజల ఒత్తిడికి బాబు కచ్చితంగా తలొగ్గుతారని, బీజేపీతో ఇప్పటికిప్పుడు తెగతెంపులు చేసుకోకపోయినా, ఆ దిశగా అడుగులు వేస్తారని అంచనా వేశారు. అంచనా నిజమయ్యే సూచనలు కనిపిస్తుండడంతో థర్డ్ ఫ్రంట్ ఆలోచన తెరపైకి తీసుకొచ్చారు. ఏపీకి హోదా ఇవ్వాల్సిందేనని తనతోపాటు టీఆర్ఎస్ నేతలు కూడా డిమాండ్ చేయడం చంద్రబాబును థర్డ్ ఫ్రంట్‌లోకి కలుపుకురావాలనే వ్యూహంలో భాగమని భావిస్తున్నారు. ఏపీ హోదాతోపాటు, తమిళనాడు ద్రవిడ ఉద్యమ రాజకీయాలు, కేరళ లెఫ్ట్ కూటమి, కేంద్రంపై భగ్గుమంటున్న బెంగాల్ మమత గర్జన, ఒడిశా నవీన్ నిరసనలను, వాటి భవిష్యత్ రూపాలను కేసీఆర్ పసిగట్టే థర్డ్ ఫ్రంట్ వైపు సాగుతున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు.

టీఆర్ఎస్, టీడీపీ కలసి పనిచేస్తాయా?

హోదా ఉద్యమానికి మూలం రాష్ట్ర విభజన. కేసీఆర్ థర్డ్ ఫ్రంట్‌లోకి ఒకవేళ టీడీపీ కూడా వస్తే భిన్న సిద్ధాంతాలున్న ఈ రెండు పార్టీలు కలసి పనిచేయడం సాధ్యమవుతుందా? ఆంధ్ర దోపిడీ పాలన అని విమర్శించిన కేసీఆర్ ఇప్పుడు ఆ మాటను వాడ్డం లేదు. తెలంగాణపై ఆశలకు నీళ్లు వదిలేసుకున్న బాబు దృష్టి ఇప్పుడు పూర్తిగా తన రాష్ట్రంపైనే ఉంది. కనుక గత శత్రుత్వాలు, వైమనస్యాలు వారి మధ్య పెద్దగ ఉండకపోవచ్చు. సమాఖ్య వ్యవస్థ, రాష్ర్టాలకు విస్తృత అధికారాల భూమికపై ఇద్దరూ కలసి పనిచే అవకాశం ఉంది. అయితే అదికూడా కేంద్రం ఇబ్బంది పెట్టనంత వరకే. సీబీఐ, ఈడీ కేంద్రం చేతుల్లో ఉండడం, ఏపీ మంత్రులపై అవినీతి ఆరోపణలు, తెలంగాణకు కేంద్ర నుంచి సాయం అందాల్సిన అవసరం, నదీ జలాల వివాదాలు తదితర అంశాలన్నీ బాబు, కేసీఆర్‌ల ఐక్యతకు చెక్ పెట్టే అవకాశముంది.