రాజ్యం మీ చేతుల్లో..  కేసీఆర్ నగారా - MicTv.in - Telugu News
mictv telugu

రాజ్యం మీ చేతుల్లో..  కేసీఆర్ నగారా

March 30, 2018

తెలంగాణలో గిరిజనులకు అనుకూలమైన ప్రభుత్వం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. ‘రాజ్యం మీ చేతుల్లోనే.. డబ్బులు కూడా మీ చేతుల్లోనే.. మీకు అనుకూలమైన ప్రభుత్వం ఉంది. మీరు అనుకున్నది సాధించుకునే అవకాశం ఉంది. దాన్ని వాడుకోకపోతే మీదే తప్పు. మనకు ఎవరూ సాయం చేయరు’ అని పేర్కొన్నారు. గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చినందుకు కేసీఆర్‌కు గిరిజనులు శుక్రవారం ధన్యవాదాలు తెలిపారు. ప్రగతి భవన్‌కు వచ్చిన వారిని ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు.

‘తెలంగాణ వస్తదని ఎవరైనా అనుకున్నారా?  నేను బయల్దేరితే భయపెట్టారు. కొట్లాడితే వచ్చింది కదా. ఈ రోజు తండాలు గ్రామ పంచాయతీలుగా మారాయి కదా! గిరిజనులకు ప్రత్యేక జీవన శైలి, భాష ఉంది. విశాల భారతదేశంలో ఉన్న అనేక జాతులు తమ సంప్రదాయ సంస్కృతులను, జీవన శైలిని కాపాడుకుంటాయి. తండాలను అద్దాల్లా తీర్చిదిద్దాలి.

తెలంగాణ రాష్ట్రంలోనే 3వేల గిరిజన గ్రామాలు పంచాయతీలుగా ఉండే అవకాశం ఉంది. ఇది ఉమ్మడి ఏపీలోనూ లేదు. ఏడాదికి కనీసం రూ.20లక్షలు వస్తాయి. నేరుగా తండాకు వచ్చే ఈ డబ్బుతో అద్దాల్లాగా దిద్దుకోండి. తండాల్లో విద్యుత్‌ సమస్య ఇక ఉండదు. మిషన్‌ భగీరథ వల్ల నీటి సమస్య తీరుతుంది. ఏ పార్టీ వాళ్లు అధికారంలో ఉన్నా ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు వస్తాయి. ఐదేళ్లలో రూ. 35వేల కోట్లు ఖర్చుపెడితే గిరిజన తండాల్లో అసలు పేదరికమే ఉండదు’ అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు సీతారామ్‌నాయక్‌, బూర నర్సయ్యగౌడ్‌, ఎమ్మెల్యే రెడ్యానాయక్‌, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.