టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారిన తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ కి దేశంలోని పలు ప్రాంతాల నుంచి మద్దతు లభిస్తోంది. ఈ క్రమంలో అనూహ్యంగా ఏపీ నుంచి ఆహ్వానం వస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు వంటివి కేసీఆర్ తోనే సాధ్యమని విశ్వవిద్యాలయాల విద్యార్ధి సంఘం జేఏసీ ఉపాధ్యక్షుడు రాయపాటి జగదీష్ అభిప్రాయపడ్డారు. ఏపీ ప్రయోజనాల కోసం ప్రధాని నరేంద్ర మోదీతో పోరాడడం ఏపీ సీఎం వైఎస్ జగన్ వల్ల కాదన్నారు. పెదకాకానిలో జరిగిన జేఏసీ సమావేశంలో జగదీష్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా కేసీఆర్ కే సాధ్యమని స్పష్టం చేశారు. అందుకే బీఆర్ఎస్ పార్టీని ఏపీలో ఆహ్వానిస్తున్నామని, ఆయన నాయకత్వాన్ని బలపరుస్తున్నామని తెలిపారు. దీంతో పాటు రాజధానిగా అమరావతిని డెవలప్ చేసే శక్తి కేసీఆర్ కి ఉందని నమ్ముతున్నట్టు వ్యాఖ్యానించారు.