రైతన్నలకు కేసీఆర్ శుభవార్త..గేదె, ఆవు పాల ధరలు పెంపు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విజయ డెయిరీ రైతులకు ఓ శుభవార్తను చెప్పింది. డెయిరీ పాల సేకరణ ధరను పెంచుతూ, సోమవారం నిర్ణయం తీసుకుంది. రాజేంద్రనగర్‌లో జరిగిన పాడి రైతుల అవగాహన సదస్సులో ఈ విషయంపై సుదీర్ఘంగా చర్చలు జరిపి, పాడి రైతుల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, గేదె పాలు, ఆవు పాల ధరలను పెంచిన్నట్లు తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
సదస్సు అనంతరం తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.."తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. డెయిరీ పాల సేకరణ ధరను పెంచింది. లీటర్ గేదె పాల ధరను రూ.46.69 నుంచి రూ.49.40కు పెంచింది. ఆవు పాల ధరను రూ.33.75 నుంచి రూ.38.75కు పెంచింది. ఇప్పటికే పాడి గేదెలకు ప్రభుత్వం ఉచితంగా మందులు, వైద్యసేవలు అందిస్తుంది. నష్టాల్లో ఉన్న విజయ డెయిరీ తెలంగాణ ఏర్పాటు అయ్యాక లాభాల్లోకి వచ్చింది. విజయ డెయిరీకి పాలను అమ్మే రైతులు ఆనందంగా పాలను పోయండి. ధరలు పెరిగాయి. పెంచిన ఈ ధరలు వెంటనే అమల్లోకి వస్తాయి" అని ఆయన అన్నారు.
ప్రస్తుతం రైతులు.. గేదె పాలకు లీటరుకు రూ.40 నుంచి రూ.45 మధ్య రైతులకు చెల్లిస్తున్నారు. లీటరు ఆవు పాలకు గరిష్టంగా రూ.28 వరకు చెల్లిస్తున్నారు. అయితే, పాడి రైతులు మాత్రం ఈ ధర గిట్టుబాటు కాదంటున్నారు. గేదె పాలకు (6% ఫ్యాట్‌పై) లీటరుకు రూ.55, ఆవు పాలు (3% ఫ్యాట్‌పై) లీటరుకు రూ.35 చొప్పున చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పాడి రైతుల డిమాండ్లను దృష్టిలో ఉంచుకున్న తెలంగాణ సర్కార్ పాల ధరలను పెంచుతూ, ఆదేశాలు జారీ చేసింది. లీటర్ గేదె పాలు రూ.46.69 నుంచి రూ.49.40కు, ఆవు పాల ధరను రూ.33.75 నుంచి రూ.38.75కు పెంచింది.