భారత్ బ్యాట్స్‌మెన్ కేదార్ జాదవ్ గుర్తున్నాడా ..? ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెట్, ఐపీఎల్లో వెలుగు వెలిగి తర్వాత కనిపించకుండా పోయాడు. ధోని హయాంలో వన్డేలు, టీ20 టీ 20 జట్టులో కనిపించిన కేదార్ క్రమంగా జట్టుకి దూరమయ్యాడు. ఐపీఎల్‌లోనూ రెండేళ్లుగా అమ్ముడుపోలేదు. 2021 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బేస్ ప్రైజ్ రూ.2 కోట్లకు కేదార్ జాదవ్‌ని కొనుగోలు చేసింది. ఆ సీజన్లోనూ జాదవ్ దారుణంగా విఫలమయ్యాడు. అంతకుముందు చెన్నై తరఫున జిడ్డు బ్యాటింగ్‌తో అభిమానుల నుంచి విమర్శలు ఎదుర్కొన్నాడు. సన్ రైజర్స్ వదిలేయడంతో 2022 మెగా వేలంలో పాల్గొన్న జాదవ్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. ఐపీఎల్ 2023 మినీ వేలంలో షార్ట్ లిస్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. తాజాగా ఓ భారీ ఇన్నింగ్స్‌తో మళ్లీ వార్తల్లో నిలిచాడు.
మూడేళ్ల తర్వాత ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన కేదార్ జాదవ్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. అస్సాంతో జరుగుతున్న మ్యాచ్‌లో మహారాష్ట్ర తరుపున బరిలో దిగిన జాదవ్ ఏకంగా డబుల్ సెంచరీ బాదేశాడు. 283 బంతుల్లో 21 ఫోర్లు, 12 సిక్సర్లతో 283 పరుగులు చేశాడు. ట్రిపుల్ సెంచరీకి 17 పరుగుల దూరంలో ఔటయ్యాడు. కేదార్ ఇన్నింగ్స్‌తో మహారాష్ట్ర భారీ స్కోర్ సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో 594/6 వద్ద డిక్లేర్డ్ చేసింది. దీంతో 320 పరుగుల భారీ ఆధిక్యాన్ని దక్కించుకుంది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన అస్సాం మొదటి ఇన్నింగ్స్‌లో 274 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
37 ఏళ్ళ కేదార్ జాదవ్ టీం ఇండియా తరఫున 73 వన్డేల్లో 42 సగటుతో 1389 పరుగులు చేశాడు. 2 శతకాలు, 6 అర్థశతకాలు అతడి కెరీర్లో ఉన్నాయి.ఇక 78 ఫస్ల్ క్లాస్ మ్యాచ్‌ల్లో 45.72 సగటుతో 5166 పరుగులు చేశాడు. 14 సెంచరీలు, 20 అర్ధసెంచరీలు సాధించాడు.