సినిమా పరిశ్రమలో హీరోయిన్లను ఎక్కువగా వేధించే సమస్య కాస్టింగ్ కౌచ్ ఒకటి. దీనిపై ఇప్పటికే పలువురు బాహాటంగానే విమర్శలు గుప్పించారు. తాము ఎదుర్కొన్న అనుభవాలను బయటపెట్టారు. అవకాశాలు కోసం ఎన్నో అవమానాలు చూసినట్లు తెలిపారు. శ్రీ రెడ్డి వంటి వారు ఏకంగా దీనిపై అర్థనగ్న ప్రదర్శన చేసి నిరసన తెలిపారు.
తాజాగా కాస్టింగ్ కౌచ్ పై నటి కీర్తి సురేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘చాలా మంది హీరోయిన్లు నాకు కాస్టింగ్ కౌచ్ గురించి చెప్పారు. వారు ఎదుర్కొన్న అనుభవాల్ని కూడా వివరించారు. కానీ ఇప్పటి వరకూ నాకు ఆ అనుభవం ఎదురుకాలేదు. బహుశా మన ప్రవర్తన ఆధారంగా ఆ కమిట్మెంట్ ప్రపోజల్ వస్తుందేమో. ఒకవేళ నన్ను ఎవరైనా కమిట్మెంట్ అడిగితే? నేను నో అని చెప్తాను. అలా చెప్పడం కారణంగా సినిమాలు దూరమైనా ఫర్వాలేదు. వెళ్లి వేరే ఏదైనా జాబ్ చేసుకుంటాను. అంతేతప్ప అవకాశాలు కోసం దిగజారను’’ అని కీర్తి సురేష్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కీర్తి వ్యాఖ్యలు వైరల్గా మారాయి.
మహానటి సినిమాలో అద్భుత నటనతో తెలుగువారికి మరింత దగ్గరైన కీర్తి సురేష్ ప్రస్తుతం హీరో నానితో దసరా చిత్రంలో నటిస్తుంది. ఈ మూవీ వచ్చే ఏడాది థియేటర్లలోకి రానుంది. గతంలో నేను శైలజ, నేను లోకల్, సర్కారు వారి పాట వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం తెలుగు, తమిళ్లో మంచి అవకాశాలను అందిపుచ్చుకొని కెరీర్లో దూసుకుపోతుంది.