Keith created a record by sky surfing in the sky
mictv telugu

వీడియో : ఆకాశంలో స్కై సర్ఫింగ్.. గిన్నీస్ రికార్డు బద్దలు

August 26, 2022

Keith created a record by sky surfing in the sky

మామూలుగా నేల మీద గుండ్రంగా పది పన్నెండు చుట్లు తిరగగానే మనకు తల తిరుగుతుంది. కాసేపటికి పట్టుతప్పి కింద పడిపోతుంటాం. అదే ఒకేసారి 175 చుట్లు తిరిగితే అమ్మో గ్రేటే అంటారు. మరి ఆ చుట్లు కూడా తలకిందులుగా గాల్లో వేలాడుతూ తిరిగితే.. ఇది సాధ్యమా అని అనిపిస్తుంది. కానీ, అమెరికాకు చెందిన ఓ యువకుడు ఇలా తలకిందులుగా గాల్లో చుట్లు తిరిగి.. ఏకంగా గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కాడు. దీనికి సంబంధించి గిన్నిస్ బుక్ తాజాగా వీడియోను తమ యూట్యూబ్ చానల్ లో పెట్టింది.

స్కై సర్ఫింగ్ చేస్తూ..అమెరికాకు చెందిన కీత్ కెబె ఎడ్వర్డ్ స్నైడర్ స్కై సర్ఫింగ్ చేస్తుంటాడు. అంటే వేల అడుగుల ఎత్తున ప్రయాణిస్తున్న హెలికాప్టర్ నుంచి దూకి నేల మీదకు సర్ఫింగ్ చేస్తున్నట్టుగా రావడమన్నమాట. నిజానికి ఇదో సాహస క్రీడ. ఒక్కోసారి ఊపిరాడని పరిస్థితి ఉంటుంది. తన కాళ్లకు సర్ఫింగ్ బోటును కట్టుకుని.. తలకిందులుగా హెలికాప్టర్ స్పిన్స్ (సర్ఫింగ్ బోట్ హెలికాప్టర్ పైన బ్లేడ్లలా తిరుగుతూ, కింద తాను గుండ్రంగా తిరుగుతుండటం) చేశాడు.జులై 4వ తేదీన వర్జీనియాలోని ఆరెంజ్ కౌంటీలో హెలికాప్టర్ నుంచి దూకి ఒకే దఫాలో ఏకంగా 175 రివర్స్ స్పిన్స్ చేశాడు. తద్వారా తన రికార్డును తానే అధిగమించాడు. కీత్ 2021లో కూడా ఈజిప్ట్‌లోని గిజాలో పిరమిడ్ల సమీపంలో ఇలాంటి ప్రయత్నమే చేసి 165 చుట్లు తిరిగాడు. గిన్నిస్ బుక్ ప్రతినిధులు ఈ ఫీట్ ను హెలికాప్టర్ లోంచి పరిశీలించడంతోపాటు వీడియోను చిత్రీకరించారు. ఈ వీడియోను చూస్తున్న నెటిజన్లు ఆ సాహసవీరుడి ఫీట్లకు ఫిదా అవుతున్నారు.