అభిమానుల దుంపతెగ.. నామినేషన్ వెయ్యలేకపోయిన సీఎం - MicTv.in - Telugu News
mictv telugu

అభిమానుల దుంపతెగ.. నామినేషన్ వెయ్యలేకపోయిన సీఎం

January 20, 2020

Kejriwal.

ఆమ్‌ అద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌‌కు చేదు అనుభవం ఎదురైంది. నామినేషన్‌ దాఖలు చేయడానికి వెళ్లిన ఆయన దానిని వాయిదా వేసుకున్నారు. కేజ్రీవాల్ సోమవారం మధ్యాహ్నం తన నివాసం నుంచి ర్యాలీగా బయల్దేరారు.  తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదం తీసుకున్న అనంతరం కేజ్రీవాల్‌ రోడ్‌షో ద్వారా నామినేషన్‌ వేసేందుకు బయలుదేరారు. వాల్మీకి ఆలయం నుంచి జామ్‌నగర్‌ హౌస్ వరకు రోడ్‌షో సాగింది. 

ఆయన వాహనం వెంట భారీగా మద్దతుదారులు, ఆప్ కార్యకర్తలు, అభిమానులు తరలిరావడంతో రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. అందరూ ఆప్ ఎన్నికల గుర్తు ‘చీపురు’ను ప్రదర్శిస్తూ అధినేతకు ఆహ్వానం పలికారు. దీంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. సరైన సమయానికి ఎన్నికల కార్యాలయానికి ఆయన చేరుకోలేకపోయారు. మధ్యాహ్నం 3 గంటల లోపు ఎన్నికల కమిషనర్‌కు నామినేషన్‌ పత్రాలు అందజేయాల్సి ఉండగా.. ఆ సమయానికి కేజ్రీవాల్ ఇంకా రోడ్‌షోలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన నామినేషన్ సరైన సమయానికి దాఖలు చేయలేక వాయిదా వేసుకున్నారు. 

దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘నేను నామినేషన్‌ వేయాలనుకున్నా. రోడ్‌షోలో పాల్గొన్న ప్రజలను వదిలి ఎలా వెళ్లలేకపోయాను. అందుకే నామినేషన్ వాయిదా వేసుకున్నాను. రేపు నామినేషన్‌ వేయాలని నిర్ణయించుకున్నా’ అని కేజ్రీవాల్ తెలిపారు. అయితే రేపటితో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల గడువు ముగుస్తుంది. కాగా, ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఫిబ్రవరి 8న ఎన్నికలు జరగనున్నాయి. 11న ఫలితాలు వెలువడుతాయి. ప్రధాన పార్టీలైన ఆప్, బీజేపీ అభ్యర్థులు ఇప్పటికే హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు.