Kejriwal government won the confidence motion
mictv telugu

విశ్వాస పరీక్ష నెగ్గిన కేజ్రీవాల్.. గుజరాత్‌లో పెరిగిన ఓట్ షేర్

September 1, 2022

ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం విశ్వాస పరీక్ష నెగ్గింది. గురువారం అసెంబ్లీలో ప్రభుత్వం విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, 59 మంది సభ్యులు అనుకూలంగా ఓటేశారు. ఆప్ మొత్తం బలం 62 కాగా, ఇద్దరు సభ్యులు విదేశాల్లో ఉండడంతో ఓటింగ్‌లో పాల్గొనలేదు. మరొకరు స్పీకరు స్థానంలో ఉన్నారు. ఓటింగ్ అనంతరం కేజ్రీవాల్ సర్కారు విజయం సాధించినట్టుగా స్పీకర్ ప్రకటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ బీజేపీని విమర్శించారు. ఇతర రాష్ట్రాల మాదిరిగానే ఢిల్లీలోనూ ఆప్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి బీజేపీ కుట్ర చేసిందని ఆరోపించారు. అయితే బీజేపీ కుట్రలు ఢిల్లీలో విఫలమయ్యాయని అన్నారు. అనుకూలంగా ఓటేయడం ద్వారా సభ్యులు వారి ప్రభుత్వాన్ని వారే కాపాడుకున్నట్టయిందని వ్యాఖ్యానించారు. ఆప్ ఎమ్మెల్యేలు నిజాయితీ పరులని, ఎలాంటి ప్రలోభాలు, భయాలకు లొంగకుండా దృఢంగా వ్యవహరించారని కొనియాడారు. ఉత్తుత్తి కేసులు వేయడం ద్వారా బీజేపీ విలువైన సమయాన్ని వృథా చేస్తోందని మండిపడ్డారు. మనీష్ సిసోడియాపై దాడులు చేయడం ద్వారా గుజరాత్‌లో తమ పార్టీకి నాలుగు శాతం ఓటు బ్యాంకు పెరిగిందని, అరెస్ట్ చేస్తే మరో ఆరు శాతం పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.