కాబోయే ప్రధాని కేజ్రీవాలే..ఆప్‌నేత జోస్యం - MicTv.in - Telugu News
mictv telugu

కాబోయే ప్రధాని కేజ్రీవాలే..ఆప్‌నేత జోస్యం

March 10, 2022

02
భారతదేశానికి 2024లో కాబోయే ప్రధాని ఎవరు అనే అంశంపై దేశ వ్యాప్తంగా కీలక చర్చ జరుగుతుంది. గురువారం ఉత్తర భారతదేశంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. ఈ సందర్భంగా యూపీ, పంజాబ్‌ ఫలితాలపై ఎక్కువ ఉత్కంఠ నెలకొంది. యూపీలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని, పంజాబ్‌లో ఆప్‌(ఆమ్‌ ఆద్మీ పార్టీ) గెలుస్తుందని పలు సర్వేలు ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆప్‌ నేత, పంజాబ్‌ ఎన్నికల సహ ఇన్‌ఛార్జ్ రాఘవ్‌ చద్దా ఓట్ల లెక్కింపులో భాగంగా కౌంటింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ”ఢిల్లీ సీఎం, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌.. దేశ ప్రజల ఆశాకిరణం, దేవుడి దయ, ప్రజలు అవకాశం ఇస్తే కాబోయే ప్రధాన మంత్రి ఆయనే. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆప్‌ జాతీయ రాజకీయాల్లోకీ రోల్‌ పోషిస్తూ, రాజకీయ శక్తిగా ఎదుగుతుంది” అని అన్నారు.

అంతేకాకుండా పంజాబ్‌లో తమ పార్టీనే గెలుస్తుందని, జాతీయ రాజకీయాల్లో కేజ్రీవాల్‌ తనదైన ముద్ర వేస్తున్నారని ప్రశంసించారు. కాంగ్రెస్‌ పార్టీకి ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రత్యామ్నాయ పార్టీ అని అన్నారు. రాబోయే రోజుల్లో కేజ్రీవాల్‌.. ప్రధాన మంత్రి హోదాలో కనిపిస్తారు అని ఆశాభావం వ్యక్తం చేశారు.