ఆఫ్రికా దేశమైన కెన్యా సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో విచ్చలవిడిగా సంచారం చేస్తున్న క్యూలియా పక్షులను చంపడానికి సిద్ధమైంది. ఇందుకోసం ప్రత్యేక బడ్జెట్ కూడా కేటాయించింది. మన వద్ద ఉన్న పిచ్చుకులను పోలి ఉండే ఈ పక్షులు గుంపులు గుంపులుగా తిరుగుతూ రైతుల వరి పంటలను మూడో వంతు తినేస్తున్నాయని ఫలితంగా అసలే పేద దేశమైన కెన్యాలో తిండి గింజలకు కూడా కరువు ఏర్పడే పరిస్థితులు తలెత్తాయని ఆందోళన చెందుతోంది. ఆఫ్రికన్ నైటింగేల్ అని కూడా పిలిచే ఈ పక్షులు గడ్డి విత్తనాలు తినేవి. అయితే కరువు కారణంగా గడ్డి విత్తనాల కొరత ఏర్పడడంతో అవి తిండి కోసం వరి, గోధుమ పంటలపై పడ్డాయి. పెద్ద ఎత్తున సంతానం ఉత్పత్తి చేసే వీటి వల్ల రైతులకు భారీ స్థాయిలో నష్టం వస్తోందని కెన్యా ప్రభుత్వం ఆరోపిస్తోంది.
రైతులు క్రిమిసంహారక మందులు పిచికారి చేసి వాటిని చంపుతున్నారు. అయితే అది పరిమితం కావడంతో ఆఖరి అస్త్రంగా 60 లక్షల పక్షులను అంతం చేయాలని ప్రభుత్వమే ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. అయితే దీన్ని పర్యావరణ వేత్తలు వ్యతిరేకిస్తున్నారు. పక్షులను నియంత్రించడానికి పర్యావరణ నియంత్రణలు పాటించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, దశాబ్దాల క్రితం చైనాలో ఇలాంటి సంఘటనే జరిగింది. పంట నష్టం పేరుతో పెద్ద ఎత్తున పక్షులను చంపిన చైనా.. తర్వాత చీడపీడల బెడద ఎక్కువ కావడంతో రష్యా నుంచి ప్రత్యేకంగా పక్షులను దిగుమతి చేసుకుందని చరిత్రకారులు చెప్తున్నారు. మరి ఆ పరిస్థితి కెన్యాకు కూడా తలెత్తుతుందా? లేదా? అన్నది కాలమే తేల్చాలి.