గౌరవనీయ అధ్యక్షా.. ఇదేం కక్కుర్తి! - MicTv.in - Telugu News
mictv telugu

గౌరవనీయ అధ్యక్షా.. ఇదేం కక్కుర్తి!

February 3, 2018

ప్రజలను గోళ్లూడగొట్టి మరీ పన్నులు వసూలు చేస్తాయి ప్రభుత్వాలు. ప్రజాసంక్షేమం కోసం రవంత విదిల్చి మిగతా సొమ్మునంతా మాల్యా వంటి బడాబాబులకు పందేరం వేస్తుంటాయి. ప్రజాప్రతినిధుల సంగతి చెప్పక్కర్లేదు. ఇల్లు, కారు, సెక్యూరిటీ.. నానా అలవెన్సుల పేరుతో ప్రజాధనాన్ని ఎంచక్కా జేబులో వేసుకుంటారు. కేరళ అసెంబ్లీ స్పీకర్ వీరికంటే ఒక ఆకు ఎక్కవ చదివాడు. తనకు కళ్లజోడును కూడా ప్రజాధనంతోనే కొనివ్వాలని బిల్లుపెట్టాడు ఆ ఘనుడు.. !స్పీకర్‌ పి.శ్రీరామకృష్ణన్‌ దర్జామనిషి. ఏకంగా రూ.50 వేలు పెట్టి కళ్లద్దాలు కొన్నాడు. ఫ్రేమ్ ఖరీదు రూ. 5 వేలు, లెన్సులు రూ. 45000. బిల్లుపెడితే సర్కారే రీయింబర్స్ చేస్తుందిగదా అని పుర్రెలో తొలిచింది. అంతే చప్పున రీయింబర్స్‌మెంట్‌ కోసం బిల్లు పెట్టాడు. తను ప్రజాప్రతినిధిని కనుక తన ఖర్చులను ప్రభుత్వమే భరించాలని వివరించాడు. సర్కారు సరేలేవయ్యా.. భలేవాడివి నువ్వు అంటూ ఆ పైసలు మంజూరు చేసిపారేసింది.

ఈ విషయం ఎవరికీ తెలియదు. అయితే ఓ వ్యక్తి  సమాచార హక్కు చట్టం కింద స్పీకరు గారి కళ్లజోడు ఖర్చు గురించి ఆరా తీయడంతో బయటికి పొక్కింది. కళ్లద్దాల బాగోతంతోపాటు  2016  అక్టోబర్‌ నుంచి సదరు పి.శ్రీరామకృష్ణన్‌ అయ్యగారి వైద్యఖర్చులకు రూ.4.25లక్షలును సర్కారు చెల్లించి వైనమూ వెలుగు చూసింది. దీనిపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఎవడబ్బ సొమ్మని ఇలా పందేరం వేస్తున్నారని ఆరోపిస్తున్నాయి. దీనిపై స్పీకర్ వివరణ ఇచ్చుకుంటూ.. వైద్యుడి సలహాపైనే అంత ఖరీదైన అద్దాలు కొన్నానని చెప్పుకొచ్చారు. మరోపక్క.. కేరళ ఆరోగ్య  మంత్రి కెకె.శైలజ కూడా తానేం తక్కువ తినలేదంటూ ప్రజాధనాన్ని కొల్లగొట్టి రూ. 28 వేల ఖరీదైన కళ్లద్దాలు కొనుక్కుంది. ఫోర్జరీ సర్టిఫికెట్లతో అమ్మవారం ఈ వ్యవహారం నడిపించేసింది.