తాము ముస్లింలకు, క్రైస్తవులకు, దళితులకు వ్యతిరేకం కాదని బీజేపీ ఎన్ని కబుర్లు చెబుతున్నా ప్రయోజనం ఉండడం లేదు. ఉత్తర భారతాన్ని మినహాయిస్తే దక్షిణాదిలో కాషాయజెండా ఎగరడం కష్టమే. ఒక్క కర్ణాటక మినహా మిగిలిన దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి చట్టసభల్లో పెద్దగా ఉనికి లేదు. ఈ నేపథ్యంలో కాషాయ దళం భారీగానే స్కెచ్ వేస్తోంది.
కేరళలో ముస్లింలను, క్రైస్తవులను ఆకర్షించడానికి పక్కా పథకంతో వెళ్తోంది. ఏకంగా 10వేల మంది బీజేపీ కార్యకర్తలు పనిగట్టుకుని ఆ రెండు మతాల ప్రజల ఇళ్లకు వెళ్లనున్నారు. ఆలింగనం చేసుకుని అలాయ్ బలాయ్ చెప్పనున్నారు. కేరళలో కాంగ్రెస్, లేకపోతే వామపక్షాలు మాత్రమే అధికారంలోకి వస్తుండడం, తమ ఉనికి లేకపోవడంతో బీజేపీ ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసింది.
2019లో ఎన్నికల్లో ఒక్క సీటూ రాలేదని, వచ్చే ఎన్నికల్లోనైనా బోణీ కొట్టాలన్నది బీజేపీ ఎత్తుగడ. రాష్ర్టంలో ముస్లిం, క్రైస్తవ జనాభా 46 శాతంగా ఉంది. ఆ వర్గాల ప్రజలు బీజేపీకి సహజంగానే దూరంగా ఉంటున్నారు. మిగిలిన 50 శాతానికిపైగా హిందువుల అయితే కాంగ్రెస్, లేకపోతే లెఫ్ట్ అంటున్నారు. ఈ సమీకరణాలతో అధికారంలోకి రావడం కష్టమని, మైనారిటీల మద్దతు ఉంటేనే తప్ప ఉనికి ఉండదని బీజేపీ ఆలోచన..
పథకం ఇలా..
కాస్త సాఫ్ట్ కార్నర్ ఉన్న బీజేపీ కార్యకర్తలను ఎంచుకుని రంగంలోకి దింపుతున్నారు. ఏప్రిల్ 9న ఈస్టర్ సండే రోజున వీరు రాష్ట్రంలోని లక్ష మంది క్రైస్తవులను కలుసుకుంటారు. ఏప్రిల్ 15న వచ్చే కేరళ హిందువుల పెద్దపండగ విషుకు మీరు కూడా రావాలని ఏసు ప్రభు భక్తులను ఆహ్వానిస్తారు. తర్వాత ఏప్రిల్ మూడో వారంలో ఈద్ సందర్భంగా ముస్లింల ఇళ్లకు వెళ్తారు.
ఇది సాక్షాత్తూ ప్రధాని మోదీ ఆలోచన ప్రకారం కొనసాగనుంది. ‘స్నేహ సంవాద్’ పేరుతో మైనారిటీలకు దగ్గర కావాలని ఆయన హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో పిలుపుచ్చారు.