అన్నపూర్ణ దేశంలో..  ఆకలి తాళలేక మట్టి తిన్న పిల్లలు - MicTv.in - Telugu News
mictv telugu

అన్నపూర్ణ దేశంలో..  ఆకలి తాళలేక మట్టి తిన్న పిల్లలు

December 4, 2019

Kerala Children01

భారత దేశం అన్నపూర్ణ అంటారు. నదులు, పంటలతో కళకళలాడే దేశంలో పాడిపంటలకు కొదవలేదు. దేశం కూడా  అభివృద్ధిలో దూసుకెళ్తోంది. అత్యాధునిక సాంకేతిక విప్లవంతో ఉపగ్రహాలు అంతరిక్షంలోకి పంపిస్తున్నాం. పేదరికం దూరం అవుతోంది.. ఇవి మన నేతల నోటి వెంట వచ్చే మాటలు. భారత్ అన్నిరంగాల్లో ముందు ఉన్నది అనేది కేవలం నాణేనికి ఒకవైపు మాత్రమే. దేశంలో దారిద్య్రం కూడా అంతకు మించే ఉందని గణంకాలు చెబుతున్నాయి. వాటిని నిజం చేసే ఘటన కేరళలో చోటు చేసుకుంది. అత్యధిక అక్షరాస్యత ఉన్న రాష్ట్రంలో ఆకలికి తాళలేక ఓ నిరుపేద కుటుంబంలోని చిన్నారులు మట్టి తింటూ కనిపించారు. తినడానికి తిండి లేకపోవడంతో వారు ఇలా చేశారు. ఈ ఘటన చూసిన వారంతా విస్మయానికి గురయ్యారు.

ఇది జరిగింది ఎక్కడో మారు మూల ప్రాంతంలో అంటే అది కూడా కాదు. ఆ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలోని ఓ రైల్వే బ్రిడ్జి కింద ఈ ఘటన జరిగింది. శ్రీదేవి అనే మహిళ తన భర్తతో కలిసి ఓ రైల్వే వంతెన కింద చిన్న గుడిసెలో నివాసం ఉంటోంది. వీరికి ఏడేళ్లలోపు ఆరుగురు పిల్లలు ఉన్నారు. కొంత కాలంగా ఆమె భర్త తాగుడుకు భానిసై కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు. కుటుంబ పోషణ భారంగా మారడంతో  చిన్నారులు ఆకలి భరించలేక మన్ను తింటుండగా స్థానికులు దీన్ని గమనించారు. వెంటనే వారి దయనీయ స్థితికి చలించిపోయి శిశు సంక్షేమశాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు వచ్చి నలుగురు చిన్నారులకు ఆహారం అందజేసి వారి పోషణకు కావాల్సిన ఏర్పాట్లు చేశారు. కాగా మిగితా ఇద్దరు చిన్న పిల్లలే కావడంతో వారికి తల్లిపాలు ఇవ్వాల్సి ఉంది. 

శ్రీదేవి భర్త తండ్రి కూలి పనులు చేసుకుంటూ నిత్యం తాగి వచ్చి భార్య పిల్లలను కొడుతున్నట్టుగా తేలింది. దీనిపై స్పందించిన మేయర్ శ్రీకుమార్ ఆ కుటుంబానికి అండగా  ఉంటామని హామీ ఇచ్చారు. ముందుగా శ్రీదేవికి తమ కార్పొరేషన్‌లో ఉద్యోగం కల్పించారు. త్వరలోనే వారికి ఇంటిని కూడా నిర్మిస్తామని వెల్లడించారు. ఈ ఘటనతో మన దేశంలో ఒక్కపూట తిండి కోసం వేలు ఖర్చు చేసే వాళ్లు ఎంతగా ఉన్నారో.. ఒక్కపూట తిండిలేక పస్తులు ఉండే వారు అంతే ఉన్నారనే అంశం వెల్లడైంది. ఇకనైనా ప్రభుత్వాలు ఇటువంటి వారిపై శ్రద్ధపెట్టాలని పలువురు కోరుతున్నారు.