దేశంలో పేదరికం, నిరుద్యోగం, మతోన్మాదం పెరిగిపోతున్నాయని కేరళ ముఖ్యమంత్రి, సీపీఎం నేత పినరయి విజయన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతోందని మండిపడ్డారు. కేరళలో మతోన్మాద శక్తులను తిప్పికొడుతున్నామని, తెలంగాణలోనూ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఆయన బుధవారం ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ తొలి బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు.
‘‘ఒకే దేశం, ఒకే ఎన్నికల నినాదంతో మోదీ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాడు. రాష్ట్రాల అధికారులను కాలరాస్తున్నాడు. హిందీని బలవంతంగా రుద్దుతూ ప్రాంతీయ భాషలను నాశనం చేస్తున్నారు. చివరికి సుప్రీం కోర్టును కూడా బెదిరిస్తున్నారు. రాజ్భవన్లు బీజేపీ కార్యాలయాలుగా మారాయి. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్లు తొక్కిపెడుతున్నారు. బీజేపీ పాలనలో మైనార్టీలు, దళితులపై దాడులు పెరిగాయి. తెలంగాణ ప్రజలకు గొప్ప పోరాట చరిత్ర ఉంది. రాచరికాన్ని తరిమికొట్టారు. మతతత్వ శక్తులను కూడా తరిమేయాలి. రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి, ప్రజాస్వామ్య శక్తులను ఏకతాటిపైకి తీసుకురావడానికి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలకు అండగా నిలబడతాం,’’ అని విజయన్ చెప్పారు.