అయ్యప్పకు చేరువలో దళిత మహిళ.. చరిత్ర సృష్టిస్తుందా? - MicTv.in - Telugu News
mictv telugu

అయ్యప్పకు చేరువలో దళిత మహిళ.. చరిత్ర సృష్టిస్తుందా?

October 20, 2018

శబరిమల కొండల్లో నాలుగోరోజూ ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. అయ్యప్పను దర్శించుకుని తీరతామని పలువురు మహిళలు ముందుకుసాగుతున్నారు. అయితే సేవ్ శబరిమల ఆందోళనకారులు వారిని నీలక్కల్‌ క్యాంపుకు ముందే నిలిపేస్తున్నారు. కొందరు మహిళలు మాత్రం కట్టడి తప్పించుకుని ముందుకు దూసుకెళ్తున్నారు. మరోపక్క జోరున వర్షం కురుస్తోంది.

rr

కేరళ దళిత ఫెడరేషన్ నాయకురాలు 38 ఏళ్ల ఎస్.పీ. మంజు పంబ క్యాంపు దాటి గుడి వైపు అడుగులు వేస్తున్నారు. ఆమెకు వందమందికిపైగా పోలీసులు రక్షణగా వెళ్లారు. అయితే జోరున వర్షం కురుస్తుండడంతో ఆమెకు రక్షణ కల్పించడం సాధ్యం కాదని అంటున్నారు. మరోపక్క ఆమెపై క్రిమినల్ కేసులు ఉన్నాయని, అలాంటి వ్యక్తికి భద్రత కల్పించడం సరికాదని మరికొంతమంది పోలీసులు వాదిస్తున్నారు. ఈ వాదులాట మధ్యే ఆమె ముందుకు వెళ్తోంది. అయితే రోడ్డంతా బురదమయం కావడంతో చాలా సమయం పట్టే అవకాశముంది. ఆమె కనుక అయ్యప్ప గుడిలోకి వెళ్తే  మటుకు చరిత్ర సృష్టించినట్లే. అయితే నిన్నట్లా రుతుక్రమ వయసులో ఉన్న ఆడవాళ్లు వస్తే ఆలయాన్ని మూసేస్తామని ప్రధాన అర్చకుడు చెప్పడం, భక్తులు భారీ సంఖ్యలో అడ్డుకోవడం వంటివి జరిగితే మంజు వెనక్కి రాక తప్పదు. తాను అయ్యప్పదీక్షను నిర్విఘ్నంగా పూర్తి చేశానని, సుప్రీం కోర్టు ఆదేశాలతో కొండకు వస్తున్నానని ఆమె చెబుతోంది. హైదరాబాద్‌కు చెందిన జర్నలిస్టు జక్కల కవిత, కేరళ మహిళా హక్కుల కార్యకర్త రెహ్మానా ఫాతిమాలు నిన్న అయ్యప్ప గుడికి అత్యంత సమీపంగా వెళ్లి వెనుదిరగడం తెలిసిందే.

52 ఏళ్ల మహిళనూ అడ్డుకున్నారు…

rr

అయ్యప్ప గుడిలోకి వెళ్లడానికి 10 నుంచి 50 ఏళ్ల లోపున్న మహిళలకు అనుమతి లేని విషయం తెలిసిందే. దీన్ని సుప్రీం కోర్టు కొట్టేసి, అన్ని వయసుల వారికి అనుమతి మంజూరు చేసింది. మరోపక్క కొంతమంది ఆడవారి వయసును కచ్చితంగా అంచనా వేయలేకపోతున్నారు పోలీసులు. దీంతో లత అనే తమిళ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. ఆమె వయసు 52 ఏళ్లు. అయితే చూడ్డానికి 45 ఏళ్ల వయసు మహిళలా ఉన్నావంటూ పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. దీంతో ఆమె గుర్తింపు కార్డులను చూపింది. ఆమె వయసు గురించి భర్త, కొడుకు కూడా వివరణ ఇవ్వడంతో పోలీసులు ఎట్టకేటలకు 18 మెట్లు ఎక్కించి స్వామి వద్దకు పంపారు.