ఆ ఇళ్లలో ఏ ట్యాప్ తిప్పినా మద్యమే..  - MicTv.in - Telugu News
mictv telugu

ఆ ఇళ్లలో ఏ ట్యాప్ తిప్పినా మద్యమే.. 

February 5, 2020

కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్‌ జిల్లా చలాకుడిలో ఉన్న సోలమన్స్ ఎవెన్యూ అపార్ట్మెంట్‌లో మద్యం ఏరులై పారింది. బ్రష్ చేసుకునేందుకు నల్ల విప్పగానే నీళ్లకు బదులు మద్యం వచ్చింది. అన్ని నల్లాల్లోనూ లిక్కర్ వాటర్ రావడంతో అందరూ షాకయ్యారు. మొత్తం 18 కుటుంబాలకు ఈ విచిత్ర అనుభవవం ఎదురైంది.

అపార్ట్‌‌మెంట్ ట్యాంక్‌లో ఎవరైనా మద్యం కలిపి ఉంటారని భావించారు. సీసీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. కానీ, అలాంటిదేమీ జరగేలేదు. ఏం జరిగి ఉంటుందా? దీర్ఘంగా ఆలోచిస్తే అసలు విషయం తెలిసింది. ఆ అపార్ట్‌‌మెంట్ పక్కనే రచనా బార్ అండ్ రెస్టారెంట్ ఉండేది. ఆరు సంవత్సరాల క్రితం ఈ బార్‌లో అక్రమంగా నిల్వ ఉన్న మద్యం బాటిళ్లను ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టుకున్నారు. కోర్టు ఆదేశాలతో బార్ పరిసరాల్లోనే గొయ్యి తీసి 6వేల లీటర్ల మద్యాన్ని అందులో పారబోశారు. ఆ మద్యం భూమి లోపలికి ఇంకింది. పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌ బావిలోకి చేరింది. అలా ఆరు సంవత్సరాల క్రితం ఎక్సైజ్ శాఖ పారబోసిన మద్యం కొంచెం కొంచెంగా బయటపడింది. కానీ, పెద్దగా తెలియలేదు. తాజాగా నీళ్లలో మద్యం మోతాదు పెరగడంతో అందరూ షాకయ్యారు. ఈ ఘటనపై మున్సిపల్ సెక్రటరీ, ఆరోగ్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎక్సైజ్ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.