చిన్న వయసులో పెద్ద మనసు చాటుకున్నదో అమ్మాయి. కాలేయ వ్యాధితో బాధపడుతున్న తన తండ్రిని బతికించుకోవడానికి కాలేయాన్ని దానం చేసింది. అతి పిన్న వయసులో ఇలా అవయవదానం చేసిన యువతిగా పేరుగాంచింది.
కంటే కూతుర్నే కనాలి అని ఏ సినిమాలో అన్నారో కానీ.. కేరళలో ఈ 17 యేండ్ల బాలిక తన తండ్రిని రక్షించడానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టింది. కోర్టుకు వెళ్లి మరి అనుమతి తీసుకొని తండ్రికి కాలేయం దానం చేసింది.
క్యాన్సర్ వల్ల..
త్రిసూర్ జిల్లాలోని కొలాజీకి చెందిన 48 యేండ్ల ప్రతీష్ ఒక కేప్ నిర్వహిస్తున్నాడు. అతని కుమార్తె పేరు దేవానంద. ప్రస్తుతం 12వ తరగతి చదువుతున్నది. అయితే గత కొంతకాలంగా ప్రతీష్ అనారోగ్యంతో సతమవుతున్నాడు. దీని కారణంగా ఆసుపత్రిలో చేరాడు. పూర్తిగా పరీక్షించిన డాక్టర్లు అతను హెపోటోసెల్లర్ క్యాన్సర్ బారిన పడినట్లు కనుగొన్నారు. ఈ క్యాన్సర్ తో పాటు కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడు. దీనికి కాలేయ మార్పిడే పరిష్కారం అని తెలిపారు డాక్టర్లు.
ఆర్గాన్ యాక్ట్ ద్వారా..
కాలేయాన్ని దానం చేయాలంటే సరైన దాత దొరుకాలి. ఈ విషయంలో ప్రతీష్ కి నిరాశే ఎదురైంది మొదట. దీంతో తన ఆరోగ్య పరిస్థితి క్షీణించడం మొదలైంది. ఆ స్థితిలో తండ్రిని చూసి చలించిపోయింది దేవానంద. తానే స్వయంగా దాతగా మారాలని అనుకుంది. కానీ.. ట్రాన్స్ ప్లాంటేషన్ ఆఫ్ హ్యుమన్ ఆర్గాన్ యాక్ట్ 1994 ప్రకారం మైనర్స్ అవయవదానం చేయడానికి అనుమతి లేదు. దీంతో దేవానంద కేరళ హైకోర్టుకు వెళ్లింది. అక్కడ న్యాయమూర్తి ప్రతీష్ సమస్యను, దేవానంద కోరికను కాదనలేక అనుమతినిచ్చారు.
సర్జరీకి ముందు..
ఆసుపత్రి అధికారుల ప్రకారం.. దేవానంద తన ఆహారంలో తీవ్రమైన మార్పులు చేసింది. ఆమె కాలేయం దానం చేయడానికి సాధారణ వ్యాయామాలు చేయడానికి జిమ్ లో చేరిందని అక్కడి వైద్యులు తెలియచేశారు. ఫిబ్రవరి 9న కేరళలోని రాజగిరి ఆసుపత్రిలో శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ హాస్పిటల్ లోని మల్టీ ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ సర్వీసెస్ చీఫ్ డాక్టర్ రామచంద్రన్ నారాయణ మీనన్, ట్రాన్స్ ప్లాంట్ సర్జన్లు పాల్గొన్నారు. ప్రస్తుతం దేవానంద, ప్రతీష్ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు.