అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. శబరిమల యాత్రకు గ్రీన్ సిగ్నల్ - MicTv.in - Telugu News
mictv telugu

అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. శబరిమల యాత్రకు గ్రీన్ సిగ్నల్

August 11, 2020

Kerala Govt Allows Devotees Sabarimala

అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం శుభవార్తను వినిపించింది. కరోనా నేపథ్యంలో శబరిమల యాత్ర ఉంటుందా లేదా అనే అనుమానాలు చెక్ పెట్టింది. ఈ ఏడాది కూడామణికంఠుడి దర్శనానికి భక్తులను అనుమతిస్తామని దేవాదాయశాఖ మంత్రి కదకంపల్లి సురేంద్రన్ తెలిపారు. కోవిడ్ నిబంధనల ప్రకారం అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. నవంబర్ 16న యాత్ర ప్రారంభమవుతుందని వెల్లడించారు. దీనిపై అధికారులకు కావాల్సిన సూచనలు చేశారు. తాజా ప్రకటనతో అయ్యప్ప భక్తుల్లో ఉన్న గందరగోళం తొలగిపోయింది. 

కొండపైకి వెళ్లే భక్తులు ముందుగా వారి వెంట కరోనా నెగిటివ్ అనే సర్టిఫికెట్ తీసుకురావాలని సూచించారు. ఐసీఎంఆర్ గుర్తింపు ఉన్న ల్యాబుల్లోనే పరీక్షలు చేయించుకోవాలని పేర్కొన్నారు. భక్తుల సౌకర్యార్థం సన్నిధానం, నీలక్కల్, పంబ ప్రాంతాల్లో వైద్య సేవలను కూడా అందుబాటులో ఉంచుతామని తెలిపారు. దర్శనానికి వచ్చే భక్తులందరినీ ముందుగానే స్క్రీనింగ్ చేసి, మాస్కులు, శానిటైజర్లు అందిస్తామని అన్నారు. కచ్చితంగా ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటిస్తూ, జాగ్రత్తగా ఉండాలని అన్నారు. బస్సుల్లోనూ భౌతికదూరాన్ని పాటించి ప్రయాణం చేసేలా ఏర్పాటు చేస్తున్నారు. అత్యవసర వైద్య సేవల కోసం హెలికాప్టర్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయని చెప్పారు.