శబరిమల అయ్యప్ప ఆలయ ప్రసాదం విక్రమాలు నిలిపివేయాలని కేరళ హైకోర్టు ట్రావెన్ కోర్ దేవస్వమ్ బోర్డుకు ఆదేశాలిచ్చింది. అరవణ ప్రసాదం తయారీలో వాడే యాలకుల్లో ఎక్కువ మోతాదులో రసాయనాలు ఉన్నాయని ఆహార భద్రత, ప్రమాణ ప్రాధికార సంస్థ నివేదిక ఇవ్వడంతో హైకోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో బుధవారం నుంచి అరవణ ప్రసాదం విక్రయాన్ని నిలిపివేశారు. వివరాల్లోకెళితే.. గతంలో యాలకులను కాంట్రాక్టును ట్రావెన్ కోర్ బోర్డు అయ్యప్ప స్పైసెస్ అనే కంపెనీకి ఇచ్చింది. తర్వాత 2020 – 2023 సీజన్లో ఈ కాంట్రాక్టును కొల్లాంకు చెందిన ఓ సప్లయర్ కు అప్పగించింది.
దీనిపై స్పందించిన అయ్యప్ప స్పైసెస్ కంపెనీ కాంట్రాక్టు కేటాయింపులో అక్రమాలు జరిగాయనీ, నాణ్యతపై రాజీ పడ్డారని ఫిర్యాదు చేసింది. దీంతో యాలకులను లాబొరేటరీలో పరీక్షలు చేయగా, పరిమితికి మించి పురుగు మందుల అవశేషాలు ఉన్నట్టు తేలింది. ఈ నివేదిక ఆధారంగా న్యాయస్థానం విచారణ చేపట్టి మధ్యంతర ఆదేశాలను జారీ చేసింది. ప్రమాణాలకు అనుగుణంగా కొనుగోలు చేసిన యాలకులతో చేసిన ప్రసాదాన్ని విక్రయించుకోవచ్చని సూచిస్తూ విచారణను జనవరి 13వ తేదీకి వాయిదా వేసింది.